అక్రమాలను అడ్డుకుంటే కేసులా? | - | Sakshi
Sakshi News home page

అక్రమాలను అడ్డుకుంటే కేసులా?

Jun 25 2026 12:18 AM | Updated on Jun 25 2026 12:18 AM

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు

రాజానగరం: నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోతోందని, దోపిడీయే లక్ష్యంగా చెలరేగిపోతున్న మైనింగ్‌ మాఫియా ఆగడాలను అడ్డుకున్న వారిపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. మండలంలోని మల్లంపూడిలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన జగనన్న కాలనీలో మట్టిని అదే గ్రామానికి చెందిన పప్పు భీమరాజు అక్రమంగా తవ్వి, తరలిస్తున్నాడు. దానిని ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ ముప్పిడిశెట్టి నాగచక్రదొర, అతని కుమారుడు జస్వంత్‌, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై భీమరాజు ఇచ్చిన ఫిర్యాదుతో రాజానగరం పోలీసులు మాజీ సర్పంచ్‌, అతని కుమారుడిని అరెస్టు చేసి, 307 కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న జక్కంపూడి రాజా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రాజానగరం పోలీసు స్టేషనుకు చేరుకుని, అక్రమాలను అడ్డుకుంటే అరెస్టు చేస్తారా? అంటూ పోలీసు చర్యను నిరసిస్తూ పోలీసు స్టేషను ముంగిటనే బైఠాయించారు. అక్కడనే నిద్రించారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడకు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చెరువుకు గండి – రైతులకు నష్టం

అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మల్లంపూడిలో ఉన్న సాగునీటి చెరువుకు గత నెలలో గండి కొట్టి, మట్టి తవ్వకాలకు తెర తీసినప్పుడు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని జక్కంపూడి రాజా అన్నారు. ఆ సమయంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుని, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారని, ఇంతవరకు ఎటువంటి చర్యలూ లేవన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును చెత్త బుట్ట పరం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ విధంగా నిర్లిప్త ధోరణితో వ్యవహరించడం వల్లనే ఈసారి ఏకంగా జగనన్న కాలనీలో మట్టిని తవ్వేసి, సొమ్ము చేసుకునేందుకు మట్టి అక్రమార్కులు సిద్ధమయ్యారని విమర్శించారు. అది తప్పు అని అడ్డుకున్న వారిపై ఆగమేఘాలపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయడం ఏమంత సమంజమని ప్రశ్నించారు.

పోలీసుల చర్యకు నిరసనగానే బైఠాయింపు

అక్రమ అరెస్టులను నిరసిస్తూ జక్కంపూడి రాజా చేపట్టిన బైఠాయింపు రాజానగరం పోలీసు స్టేషను వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. నియోజకవర్గంలోని సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల నుంచి కూడా పార్టీ కేడర్‌ భారీగా తరలివస్తున్న క్రమంలో రాజాతో సీఐ వీరయ్యగౌడ్‌ చర్చలు జరిపారు. మాజీ సర్పంచ్‌ వర్గీయుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫిర్యాదు తీసుకుని, పప్పు భీమరాజు వర్గీయులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించడంతో ఆందోళనను విరమించారు.

రాజానగరం పోలీసు స్టేషను ముంగిట బైఠాయించిన జక్కంపూడి రాజా

పోలీసు స్టేషనుకు చేరుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందని జక్కంపూడి రాజా విమర్శించారు. గోదావరిలో ఇసుక, గ్రావెల్‌ కోసం కొండలు, మట్టి కోసం చెరువులు, కాలువగట్లు తవ్వుకుంటూ పోతున్న ఈ అక్రమార్కులు జగనన్న కాలనీల్లో కూడా దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి అక్రమాలను అడ్డుకోవడంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపిణా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగేది లేదని జక్కంపూడి రాజా తేల్చిచెప్పారు. పార్టీ కేడర్‌ కూడా అందుకు సిద్ధంగానే ఉందన్నారు. అయితే ఈరోజు అక్రమార్కులకు అండగా నిలిచి, అధికార పార్టీ పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం ఒకటి గ్రహించాలని, ఈ భోగం శాశ్వతం కాదని, రాబోయే కాలంలో దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతోంది

రాజానగరం పోలీసు స్టేషను వద్ద

జక్కంపూడి రాజా నిరసన

అర్ధరాత్రి నుంచీ

10 గంటలపాటు బైఠాయింపు

తరలివచ్చిన

వైఎస్సార్‌ సీపీ కేడర్‌

గంటల తరబడి స్టేషన్‌ వద్ద

ఉద్రిక్త వాతావరణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement