ముందస్తు సాగుకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు సాగుకు శ్రీకారం

Jun 25 2026 12:18 AM | Updated on Jun 25 2026 12:18 AM

దేవరపల్లి: దాళ్వా సీజన్‌ పూర్తికావడంతో సార్వా వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టారు. బోర్లు కింద ముమ్మరంగా వరి ఆకుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల నారుమడులు వేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా వరి నాట్లు వేస్తున్నారు. కొవ్వూరు డివిజన్‌లోని నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, అనపర్తి, తాళ్లపూడి, మండలాల్లో వరి నాట్లు జరుగుతున్నాయి. కాలువలకు నీరు విడుదల చేయడంతో డెల్టాలో రైతులు వరి నారు మడులు వేస్తుండగా, మెట్ట ప్రాంతంలోని రైతులు బోర్ల కింద ఆకుమడులు వేస్తున్నారు. చెరువులు, తాడిపూడి కాలువ కింద సాగుకు అవసరమైన నారును బోర్ల కింద ఆకుమడులు వేసి నారు పెంచుతున్నారు. మే నెల రెండవ వారంలో వేసిన నారు నాటడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది రైతులు వారం రోజుల నుంచి నారుమడులు వేస్తున్నారు.

అధిక దిగుబడులు వచ్చే వంగడాల సాగు

దాళ్వాలో అధిక దిగుబడులు ఇచ్చే 120 రోజుల పంట కాలపరిమితి వంగడాలు స్వర్ణ–7029, పీఎల్‌ఏ–1100, ఎంటీయూ–1318, సంపద స్వర్ణ రకాల వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. 60 శాతం మంది స్వర్ణ రకాల వంగడాలను సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తున్నట్టు రైతులు తెలిపారు.

నెలాఖరుకు ముమ్మరంగా..

సార్వా పంటకు 4,800 హెక్టార్లలో నారుమడులు వేయవలసి ఉండగా, ఇప్పటి వరకు 1,600 హెక్టార్లలో వేశారు. బోర్ల కింద ఆకుమడులు వేసి నారు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురిసిన వెంటనే చెరువులు, కాలువ కింద నాట్లు వేస్తారు. ఈ నెలాఖరుకు ఆకుమడులు ముమ్మరంగా వేస్తారని అధికారులు చెబుతున్నారు.

2,200 ఎకరాల్లో నాట్లు

జిల్లావ్యాప్తంగా సార్వా సీజన్‌లో 96,266 హెక్టార్ల వరి సాగు సాధారణ విస్తీర్ణం ఉంది. ఇప్పటి వరకు 2,200 హెక్టార్లలో నాట్లు వేశారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే రైతులు బోర్ల కింద, కాలువల కింద ఆకుమడులు వేసి పెంచుతున్నారు. నారుమడులు ఆశాజనకంగా, ఆరోగ్యకరంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆకుమడులకు అవసరమైన విత్తనాలు, సాగుకు అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ముందస్తు చర్యలు

సార్వా సీజన్‌కు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ముందుగా రైతులకు పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా 30 రకాల విత్తనాలను సొసైటీల ద్వారా సరఫరా చేశారు. విత్తనాలను10 కిలోల చొప్పున కిట్లు తయారు చేసి అందజేశారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో పచ్చిరొట్ట పంటలు వేశారు. వరి పండించే భూముల్లో పచ్చిరొట్ట పంటలు వేసి, పూత దశలో భూమిలో కలియ దున్నుతున్నారు.

కొవ్వూరు డివిజన్‌లో..

కొవ్వూరు డివిజన్‌ పరిధిలోని తొమ్మిది మండలాల్లో 93,874 హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. 4,829 హెక్టార్లలో నారుమడులు వేయవలసి ఉండగా, ఇప్పటి వరకు 2,294 హెక్టార్లలో వేశారు. 17,153 మెట్రిక్‌ టన్నుల యూరియా ఎరువు అవసరం కాగా, ఈ నెలలో 3328 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచారు. ఎల్‌నినో ప్రభావంతో దీర్ఘకాలిక రకాలను కాకుండా స్వల్పకాలిక రకాల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దేవరపల్లి మండలం యర్నగూడెం, కృష్ణంపాలెం, సంగాయగూడెం, నల్లజర్ల మండలం అనంతపల్లి, నల్లజర్ల, చోడవరం ప్రాంతాల్లో నాట్లు ప్రారంభించారు. వర్షాలు పడితే ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకుంటాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.

బోర్ల కింద నాట్లు ప్రారంభం

డెల్టాలో ముమ్మరంగా ఆకుమడులు

రైతులకు అందుబాటులో విత్తనాలు

1,600 హెక్టార్లలో ఆకుమడులు

96,266 హెక్టార్లలో సాగు

అవసరం మేరకు ఎరువులు

సార్వా వరి పంటకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచాం. సొసైటీలు, ప్రయివేటు డీలర్ల వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా యూరియా, డీఏపీ రైతులకు సరఫరా చేస్తున్నాం. బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. 22 వందల ఎకరాల్లో ఇప్పటికి నాట్లు పడ్డాయి. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉన్నందున వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈ ఏడాది సుమారు 4,800 ఎకరాల్లో వరి పంట తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు చర్యలు చేపట్టాం. వర్షాలు పడే అవకాశం లేదు. ఈ నెలలో జిల్లాలో సగటు వర్షపాతం 60 మిల్లీ మీటర్లు నమోదు కావలసి ఉండగా, 27 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదయింది. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎకరం నారుమడి 20 హెక్టార్లలో నాటడానికి సరిపోతుంది.

– బి. వెంకటేశ్వరరావు,

జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement