చంద్రబాబు సాధించింది వంచన, అక్రమ అరెస్టులే | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సాధించింది వంచన, అక్రమ అరెస్టులే

Jun 25 2026 12:18 AM | Updated on Jun 25 2026 12:18 AM

రాజమహేంద్రవరం సిటీ: ప్రజలను వంచించడం, ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు పంపించి, కక్ష సాధించడమే రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం సాధించిందని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ భరత్‌రామ్‌ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌ సీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ అక్కడి ప్రజలకే తెలియరని.. అటువంటి వ్యక్తికి జగమెరిగిన, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సవాల్‌ చేసే స్థాయి లేదని అన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు, 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేరింగ్‌ వచ్చిన పార్టీ వైఎస్సార్‌ సీపీ ఒక్కటేనని గుర్తు చేశారు. అన్ని పార్టీలూ కలసి దాడి చేసినా చలించని తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్‌ను విమర్శించే స్థాయి నానాజీకి ఎక్కడుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్‌ పార్లమెంటరీ భాషతో మాటలు తగవని, జగన్‌పై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను నానాజీ తక్షణం ఉపసంహరించుకోవాలని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. జగన్‌ సామర్థ్యం, పట్టుదల రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని, ఆయనను తిట్టడం వల్ల కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడాలన్న ఆరాటమే నానాజీలో కనిపిస్తోందని అన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఒక ప్రొఫెసర్‌ను తిట్టినందుకు నానాజీ క్షమాపణ చెప్తే సరిపోయేదని, దీనికి బదులు గుళ్లు, గోపురాల్లో ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో పొర్లుదండాల డ్రామా చేశారని విమర్శించారు. ‘ఇంకా రెండున్నర సంవత్సరాలే ఉంది గుర్తు పెట్టుకో నానాజీ.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు, వడ్డీ కలిపి ఇచ్చేస్తాం’ అని భరత్‌రామ్‌ అన్నారు. 17 ఏళ్ల రాజకీయ చరిత్రలో జగన్‌ ఏనాడూ, ఎవరినీ కఠినంగా మాట్లాడిన సందర్భాలు లేవని, అందరితో ఎంతో గౌరవంగా మాట్లాడతారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హోదా మరచిపోయి సభలు, సమావేశాల్లో తొక్క తీస్తా, తోలు వలిచేస్తా అంటున్నారని, ఇదేం భాషని భరత్‌రామ్‌ ఎద్దేవా చేశారు.

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement