ఈగల్‌ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఈగల్‌ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

Jun 25 2026 12:18 AM | Updated on Jun 25 2026 12:18 AM

ఈగల్‌ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈగల్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఈగల్‌ అడ్మిన్‌ ఎస్పీ కె.నగేశ్‌బాబు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, ఈగల్‌ విభాగం కట్టుబడి ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయనున్నామన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు ఈగల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972 కు సమాచారం అందించాలన్నారు. ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ , బీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగశ్రీనివాస్‌, ఈగల్‌ సీఐలు పీవీ.సూర్యమోహన్‌, జి.వెంకటేశ్వరరావు, వై.రాంబాబు పాల్గొన్నారు.

కేసుల పురోగతిపై సమీక్ష

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మానటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. 9 వ అదనపు జిల్లా జడ్జి షణ్ముఖరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మి యార్లగడ్డ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్యానల్‌ న్యాయవాదులు, డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదులతో కేసుల పురోగతిని సమీక్షించారు. క్రిమినల్‌ కేసులకు సంబంధించి బెయిల్‌ పిటిషన్ల స్థితిగతులపై వివరాలు తెలుసుకున్నారు.

25, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు

రాజమహేంద్రవరం సిటీ : జిల్లా మీదుగా ఈ నెల 25, 28 తేదీలలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ చర్లపల్లి –కాకినాడ (07817), 28వ తేదీ కాకినాడ– చర్లపల్లి(07818) నంబర్‌ గల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనుందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement