ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా బంతితో ఆడుకుంటుండగా, మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఐటీఐలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్ కుమార్ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెల వద్దకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్‌కు చెందిన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్ బాల్‌తో నీటిలో క్యాచ్‌లు ఆడుతుండగా, హేమంత్ కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని హేమంత్, జశ్వంత్ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా, వారి మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును ధవళేశ్వరం సీఐ టి.గణేష్ దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దిపాటి జశ్వంత్‌కుమార్, హేమంత్ (ఫైల్)
ఫ గోదావరిలో మునిగి
అన్నదమ్ముల మృతి
ఫ ధవళేశ్వరంలో ఘటన


