ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

Jun 24 2026 9:52 AM | Updated on Jun 24 2026 9:52 AM

నిడదవోలు: ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిడదవోలు ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల రాష్ట్ర స్థాయి జేఏసీ పిలుపుమేరకు మంగళవారం ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా చేశారు. ముందుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విద్యుత్‌ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం నిర్వహించాలని, ఆర్టీసీ ఉద్యోగులతోనే విద్యుత్‌ బస్సుల నిర్వహణ జరపాలని నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని, ఇప్పటికే విద్యుత్‌ బస్సుల పేరుతో ఖాళీ చేయించిన డిపోలను కొనసాగించాలని పీఆర్సీ కమిషన్‌ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ డీఏలు వెంటనే చెల్లించాలని, సీ్త్ర శక్తి పథకం అమలులో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సిబ్బందిపై పనిభారాన్ని తగ్గించాలని నినదిస్తూ బస్టాండ్‌ ఆవరణలో భారీ ర్యాలీ చేశారు. జేఏసీ డిపో కన్వీనర్‌ మేకల శ్రీనివాస్‌, బొబ్బిలి రాములు నాయకత్వం వహించారు. అటు ప్రభుత్వానికి, ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌కు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఇచ్చిన మెమోరాండంను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో జేఏసీగా రాష్ట్ర కమిటీ తీసుకునే ఏ పిలుపుకై నా కార్మికులు సిద్ధంగా ఉన్నారని కార్మిక నాయకులు హెచ్చరించారు.

నోటీసుబోర్డులో

అర్హుల జాబితా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ కమ్‌ ఒకేషనల్‌ కౌన్సెలర్‌, పీర్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులకు సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితాను ఆసుపత్రి నోటీసు బోర్డులో ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కేవీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27న సాయంత్రం 4 గంటల్లోపు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పని వేళల్లో లిఖిత పూర్వకంగా అందజేయాలన్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement