సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ఇసుకను అధికంగా వేసుకుని నడపడం, రహదారుల భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక రీచ్ పాయింట్ల నిర్వహణ ఏజెన్సీలు, ట్రాన్స్‌పోర్టర్లు, సంబంధిత సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి జిల్లాలో పరిమితికి మించి ఇసుకను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం వాహన యజమానులు, ట్రాన్స్‌పోర్టర్లపైనే కాకుండా అధిక లోడుతో వాహనాలను పంపిస్తున్న రీచ్ నిర్వహణ ఏజెన్సీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. .
ఆత్మహత్య ఘటనపై
విచారణ చేయాలి
చాగల్లు: తన కుమారుడు రవిచంద్ర ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చిట్టూరి ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ భవనం పైనుంచి దూకి 7వ తరగతి విద్యార్థి రవిచంద్ర ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై మృతుడి తండ్రి ప్రవీణ్ మంగళవారం రాత్రి కొవ్వూరు రూరల్ సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఈ నెల 25న కొవ్వూరు సీఐ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.


