● ‘ఉపాధి’ కూలీలపై మృత్యుపంజా ● నలుగురిని బలిగొన్న టిప్పర్ ● విషమంగా మరో ఇద్దరి పరిస్థితి ● చీడిగలో విషాద ఛాయలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ క్రైం: తెల్లారకుండానే పొట్టకూటి కోసం వెళ్లిన ఆ ఉపాధి కూలీల బతుకులు తెల్లారిపోయాయి. కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ వంతెన వద్ద శనివారం ఉదయాన్నే అతి వేగంగా వచ్చిన టిప్పర్.. ఉపాధి కూలీల మీద నుంచి దూసుకుపోవడంతో నలుగురు మహిళలు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో రక్తమోడుతూ చెల్లాచెదురుగా పడి ఉన్న మహిళల మృతదేహాలను చూసి స్థానికులు, తోటి శ్రామికులు, చూపరులు కంట తడి పెట్టుకున్నారు.
సెల్ సిగ్నల్ లేక రోడ్డు పైకి..
కాకినాడ రూరల్ చీడిగ గ్రామం నుంచి రోజూ మాదిరిగానే మూడు బృందాలుగా సుమారు 60 మంది కూలీలు శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొవ్వూరు చేరుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద కొవ్వూరు వద్ద పంట కాలువలో పూడికతీత పనులకు వచ్చారు. వారు పని చేస్తున్న ప్రాంతంలో మస్టర్ వేసేందుకు సెల్ సిగ్నల్ అందుబాటులో లేదు. దీంతో, ముందుగా రోడ్డు పైనే మస్టర్లు తీసుకుని, తరువాత పనుల్లో పాల్గొంటున్నారు. మస్టర్లు రికార్డు చేసి, ఫొటోలు తీసుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రబాబు కూలీలను కొవ్వూరు వంతెన వద్దకు పిలిచాడు. రెండు బృందాల మస్టర్లు పూర్తయ్యాయి.
అదుపు లేని వేగంతో..
మూడో బృందంలో 20 మందికి మస్టర్లు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఓ లే అవుట్‌లో గ్రావెల్ లోడ్ దించి, తూరంగి వైపు నుంచి చీడిగ వైపు ఓ టిప్పర్ వేగంగా వచ్చింది. మస్టర్లు పూర్తయిన 12 మందిని దాటి, తరువాత ఉన్న ఎనిమిది మంది పైకి అదుపు లేని వేగంతో దూసుకు వచ్చింది. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన గుడివాడ వీరమణి, దెయ్యాల గణికమ్మ రోడ్డు పక్కకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఆరుగురిలో కాదా చిట్టెమ్మ, వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చెల్లూరు అన్నవరం సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మట్టపర్తి అరుణకుమారి, పాలిక నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. నాగమణి కాకినాడ జీజీహెచ్‌లో, అరుణకుమారి మెయిన్ రోడ్డులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురు మృతుల దేహాలు టిప్పర్‌కు, రోడ్డు మార్జిన్‌లోని ఇనుప గడ్డర్లతో ఉన్న రెయిలింగ్‌కు మధ్య నలిగిపోయి, నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతను చూసి, అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు భీతావహులయ్యారు. పని చేస్తున్న చోటనే సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చి ఉంటే.. అసలు ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జీజీహెచ్‌లో ఆందోళన
నలుగురు మహిళల మృతదేహాలకు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. మృతుల అంత్యక్రియలకు రూ.25 వేలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించామని ఆర్‌డీఓ మల్లిబాబు తెలిపారు. బాధితు కుటుంబాలను జీజీహెచ్‌లో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించి, ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.
డ్రైవర్ మద్యం మత్తే కారణమా!
డ్రైవర్ డోలా నాగరాజు మద్యం మత్తులో టిప్పర్ నడపడం వల్లనే నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయని, ఈ ప్రమాదం నుంచి బతికి బయట పడిన కూలీలు విలపించారు. మద్యం మత్తులో ఉన్నందువల్లనే ఎడమవైపు వెళ్తున్న టిప్పర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపు తిప్పేశాడని, అందువల్లనే ఇంతటి ఘోరం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఇక్కడ ప్రమాదం జరిగిందా అంటూ తూలిపోతూ డ్రైవర్ నాగరాజు తమను ఎదురు ప్రశ్నించాడని స్థానిక కూలీలు తెలిపారు. డ్రైవర్ నాగరాజు మద్యం తాగి నిర్లక్ష్యంగా, అతి వేగంగా టిప్పర్‌ను నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు కూడా తొలుత చెప్పారు. అయితే, ప్రమాదానికి అసలు కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించ లేదు.


