గలీజు బాగోతం | - | Sakshi
Sakshi News home page

గలీజు బాగోతం

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

రాజమహేంద్రవరం నడిబొడ్డున టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం

విలువ రూ.32 కోట్లకు పైగా..

33 ఏళ్ల లీజుకు కేటాయింపు

ఏడాదికి లీజు రూ.1,000 మాత్రమే..

ఆగమేఘాలపై మంత్రిమండలి ఆమోదముద్ర

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ గ‘లీజు’ బాగోతానికి తెర తీసింది. అధికారం ముసుగులో అడ్డగోలు వ్యవహారానికి తెర తీసింది. ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కారుచౌకగా కొట్టేస్తోంది. ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన స్థలాన్ని పార్టీ ప్రయోజనాలకు తాకట్టు పెడుతోంది. రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున రూ.32 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్‌ వేసింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగింది. ఆ స్థలంలో విలాసవంతమైన టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి అడుగులు వేస్తోంది.

ఇదీ సంగతి

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్‌ ఆవ రోడ్డులో సర్వే నంబర్‌ 316/2లో మొత్తం 35 ఎకరాల దేవదాయ శాఖ భూమి ఉండేది. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించే క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 26 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చారు. వాటిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ స్థలానికి బదులుగా దేవదాయ శాఖకు వేరేచోట స్థలం కేటాయించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 9 ఎకరాల స్థలం నగర పాలక సంస్థ రెవెన్యూ పరిధిలో ఉంది. ఇందులో రెండెకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి చంద్రబాబు సర్కారు కేటాయించింది. ఏడాదికి కేవలం రూ.1,000 చెల్లించేలా.. 33 ఏళ్ల పాటు లీజుకు ఇంత విలువైన స్థలం కేటాయించేసుకున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆగమేఘాలపై ఆమోద ముద్ర సైతం వేసినట్టు సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో పరిపాలనాపరమైన అనుమతులు రాకముందే.. టీడీపీ జిల్లా నాయకత్వం ఆ స్థలంలో అట్టహాసంగా శంకుస్థాపన నిర్వహించడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

విలువైన స్థలాన్ని సులువుగా కొట్టేసి..

రూరల్‌ నియోజకవర్గం నడిబొడ్డున, జాతీయ రహదారికి సమీపాన గజం స్థలం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. తక్కువగా రూ.35 వేలు లెక్కేసుకున్నా.. రెండెకరాలకు సుమారు రూ.32 కోట్లకు పైగా పలికే అవకాశం ఉంది. అంత విలువైన స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి చాలా సులువుగా.. ఏడాదికి కేవలం రూ.1,000 లీజుకు మాత్రమే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విలాసవంతమైన భవన నిర్మాణం

ఈ భూమిలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన డిజైన్‌ను సైతం ఇప్పటికే రూపొందించారు. రెండంతస్తుల్లో భవన నిర్మాణం జరగనుంది. దీని నిర్మాణ పనులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి ఇటీవల శంకుస్థాపన సైతం చేశారు. నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అంత ఖరీదైన భూములను సొంత పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వం ధారాదత్తం చేయడంపై అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజా అవసరాలకు వినియోగించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

కలెక్టరేట్‌కు స్థల సేకరణపై నిర్లక్ష్యం

విభజన అనంతరం నవ్య తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ను బొమ్మూరు వద్ద ఉన్న న్యాక్‌ భవనంలో నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి జాంపేట పోలీస్‌ గ్రౌండ్‌ వద్ద స్థలాన్ని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పరిశీలించింది. ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చేలోగా.. సార్వత్రిక ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడిపోయింది. అనంతరం, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కలెక్టరేట్‌ శాశ్వత భవన నిర్మాణాలపై రెండేళ్లవుతున్నా దృష్టి పెట్టలేదు. కానీ, పార్టీ కార్యాలయానికి మాత్రం ఆగమేఘాల మీద భూమి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్‌ అనుబంధ భవనాలు, ప్రజా సేవా కేంద్రాలు నిర్మిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైవే సమీపాన ఉన్న ఈ ప్రాంతం ప్రజా అవసరాలకు అనువుగా ఉండగా.. రాజకీయ కార్యాలయాల కోసం వినియోగించడం సరికాదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement