మద్యానికి బానిసై.. అనుమాన భూతానికి వశమై.. | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై.. అనుమాన భూతానికి వశమై..

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

కన్న కుమార్తెను బలి తీసుకున్న తండ్రి

నాలుగేళ్ల చిన్నారిని బావిలో పడేసి హత్య

కోరుకొండ: కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసి.. ప్రయోజకుల్ని చేయాల్సిన ఆ తండ్రి మద్యానికి బానిసయ్యాడు. అనుమాన భూతానికి వశమయ్యాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడనే విచక్షణ సైతం కోల్పోయి కన్న కుమార్తె నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. కోరుకొండ మండలం గాదరాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గాదరాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామవరపు రాజు, ఓ యువతి ప్రేమించుకుని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. రాజు మూడో తరగతి, ఆమె పదో తరగతి చదువుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన రాజు.. భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత నుంచి వీరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఆమెను రాజు చిత్రహింసలు పెట్టేవాడు. కూలి పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటాన్ని తప్పు పట్టిన భార్యను కొట్టేవాడు. ఈ క్రమంలో ఆమె బంధువుల ఇంటికి వెళ్లేది. పెద్దలు జోక్యం చేసుకుని తిరిగి అత్తవారింటికి పంపేవారు. అయితే, దంపతుల మధ్య తిరిగి గొడవలు జరిగేవి. ఏడాది కాలంగా విభేదాలు తీవ్రమవడంతో రాజానగరం మండలం పాలచర్లలోని బంధువుల ఇంటికి ఆమె వెళ్లిపోయింది. మధ్యవర్తుల సలహా మేరకు తమ కుమార్తెలను భర్త వద్దకు పంపించింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా.. తనకు పుట్టలేదనే అనుమానంతో పిల్లలిద్దరినీ గురువారం కొట్టాడు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పెద్ద కుమార్తె దూరంగా పారిపోయింది. తన చేతికి చిక్కిన చిన్న కుమార్తె(4)ను ఆ దుర్మార్గుడు ఏమాత్రం కనికరం లేకుండా సమీపంలోని బావిలో పడేశాడు. నీళ్లలో మునిగిపోయి, ఆ చిన్నారి దుర్మరణం పాలైంది. అప్పటికే రాత్రి కావడంతో ఈ ఘాతుకాన్ని స్థానికులు ఆలస్యంగా శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. భర్త రాజు తన బాధ్యత మరచి, భార్యపై అనుమానాన్ని పెంచుకోవడంతో పాటు, మద్యానికి బానిసవ్వడంతో ఈ దారుణం జరిగిందని కోరుకొండ సీఐ ఎస్‌వీవీస్‌ మూర్తి శనివారం తెలిపారు. నిందితుడిని త్వరలో కోర్టులో హాజరు పరుచుతామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement