రాజమహేంద్రవరం సిటీ: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యాన వీఎల్ పురంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్లాస్టిక్‌లోని ప్రమాదకర రసాయనాలు ఆహారంలో చేరడం లేదా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని చెప్పారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని చెప్పారు. ప్రజలు కూడా స్టీల్ గ్లాసు, మట్టి వాటర్ బాటిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణంలో
భాగస్వాములు కావాలి
రాజమహేంద్రవరం రూరల్: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కలిగిన ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా బొమ్మూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం షెడ్ వద్ద ‘ప్లాస్టిక్ రహిత రాష్ట్రం’ థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన స్టార్టప్ కార్యక్రమాన్ని 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి, డ్వామా పరిపాలనాధికారి కిషోర్ కుమార్, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


