ప్రచారం చేసి.. ఏర్పాట్లు మరచి | - | Sakshi
Sakshi News home page

ప్రచారం చేసి.. ఏర్పాట్లు మరచి

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

శనైశ్చర క్షేత్రానికి వేలాదిగా భక్తులు

రద్దీతో ఇబ్బందులు పడిన వైనం

కొత్తపేట: మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) క్షేత్రంలో శనివారం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమావాస్య, శనివారం కలసి రావడం, ఆపై శని జయంతి కావడంతో స్వామివారిని దర్శించుకుంటే మంచిదని అధికారులు ప్రచారం చేశారు. దీనితో మందపల్లి శనైశ్చర ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. టిక్కెట్లు తీసుకునే కౌంటర్‌ దగ్గర భారీ రద్దీ ఏర్పడింది. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు ఆలయం ప్రధాన ద్వారాలను మూసివేశారు. దీంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తులు ఒకరినొకరు తోసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా శని జయంతి గురించి దేవస్థానం విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ రద్దీని ముందుగా అంచనా వేయలేకపోయింది. ఆలయం వెనుక స్థలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పునాదులు తీశారు. దానితో స్థలాభావం సమస్య తలెత్తింది. దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ సరిపోక ఆలయం ముందు నుంచే స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తగినన్ని టిక్కెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం, ప్రాంగణం సరిపోక మధ్య మధ్యలో గేట్లు మూసి వేయడం తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది.

ఆ ఉత్సాహం ఎక్కడ!

గత కొన్ని రోజులుగా దేవస్థానం తరఫున ప్రచారం జోరుగా చేశారు. ఈ నెల 16న శని జయంతి అని, అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులు వేలాది మంది తరలివచ్చారు. ప్రచారం చేయడంలో అధికారులు చూపిన ఉత్సాహం.. ఏర్పాట్లు చేయడంలో కనిపించలేదని పలువురు మండిపడ్డారు. అదృష్టవశాత్తూ ఏవిధమైన తొక్కిసలాట జరగకుండా, ప్రమాదం చోటుచేసుకోకుండా ముగిసింది. శనైశ్చర క్షేత్రంలో భక్తుల ఇబ్బందులపై దేవదాయ – ధర్మదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా స్థలాభావంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. శని జయంతి విశిష్టత గురించి విస్తృత ప్రచారం చేశామని, అందునా అమావాస్య, శనివారం కూడా తోడవ్వడంతో అంచనాకు మించి భక్తులు తరలివచ్చారని అన్నారు. ఆలయం వెనుక అభివృద్ధి పథకాలకు సంబంధించి పునాదులు తీయడంతో ప్రత్యామ్నాయంగా జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పూజలకు ఏర్పాట్లు చేశామన్నారు. అయితే అనేకమంది ఆలయ ప్రాంగణంలో పూజలకు తోసుకువచ్చారన్నారు. దేవస్థానం సిబ్బంది, పోలీసు బందోబస్తుతో సజావుగా దర్శనం చేసుకునేలా చేశామన్నారు. ఈ ఒక్కరోజే దేవస్థానానికి మొత్తం రూ.17,23,619 ఆదాయం వచ్చిందని వివరించారు. ఇదిలాఉంటే శనైశ్చర స్వామివారిని కొత్తపేట సబ్‌ కోర్ట్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.సాయికుమారి, ముంబయి హైకోర్టు ఫార్మర్‌ జడ్జి సునీల్‌ బీ శుక్రే తదితరులు దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement