డెంగీతో డేంజర్‌ | - | Sakshi
Sakshi News home page

డెంగీతో డేంజర్‌

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

దోమల వృద్ధితో వ్యాప్తి

నీటి నిల్వలు లేకుండా చూడాలి

పారిశుధ్యం మెరుగుపర్చుకోవాలి

నేడు జాతీయ డెంగీ దినోత్సవం

రాయవరం/ఆలమూరు: జ్వరాలలో ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైందీ డెంగీ జ్వరం. డెంగీ కారక ఏడిస్‌ ఈజిప్ట్‌ దోమ దోసెడు నీళ్లలోనే పెరుగుతుంది. ఇళ్లు, దుకాణాల పరిసరాల్లో వాడి పారేసిన కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు, పాతటైర్లు, కూలర్లు, పూలకుండీలు వంటి ఇతర వస్తువుల్లో నీటి నిల్వల్లో డెంగీ దోమ ఉంటుంది. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, నీరు నిల్వ లేకుండా చేసుకుంటే డెంగీ కట్టడి సాధ్యమవుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో 18 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వర్షాకాలం ముందు నుంచే డెంగీతోపాటు ఇతర వ్యాధులపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడేగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిలో అనాఫిలస్‌, క్యూలెక్స్‌ ఈడీస్‌, ఆర్మిజరిస్‌ దోమలు పెరుగుతాయి. ‘శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

జాగ్రత్తలు ముఖ్యం

● నీళ్ల కుండీలు, డ్రమ్ములు, గోళాలు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, సంపులు వంటి వాటిపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి.

● వారానికోసారి నీరు నిల్వ చేసిన పాత్రలను ఖాళీ చేయాలి.

● సెప్టిక్‌ ట్యాంక్‌ గొట్టంపైన్‌పలచని గుడ్డ చుట్టాలి. దీనివల్ల దోమల నివారించవచ్చు.

● మురుగుకాల్వల్లో ఎప్పటికప్పుడు చెత్తా చెదారం తొలగించాలి.

● ఏ పాత్రలైనా సరే నీరు నిల్వ లేకుండా చూడాలి.

● దోమలు కుట్టకుండాచర్యలు తీసుకోవాలి.

● దోమతెరలు, ఇంటి కిటికీలకు జాలీలు వాడాలి.

ఇవీ లక్షణాలు

ఏటా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య వందల్లో ఉండగా, అడపాదడపా మరణాలు సంభవించిన ఘటనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఈడిస్‌ ఈజిప్ట్‌ రకం దోమ కుట్టడం వల్ల తీవ్ర జ్వరం, శరీరంపై ఎరన్రి దద్దుర్లు, తీవ్రమైన తల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, ఆకలి మందగించడం, ఎర్ర రక్తకణాలు (ప్లేట్‌లెట్స్‌) తగ్గిపోతాయి. చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, మూత్రం, మలం లేదా వాంతిలో రక్తం, శ్వాస ఆడకపోవడం, అలసిపోవడం, చిరాకు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ‘ఎలీసా పరీక్ష’ చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత చికిత్స తీసుకోకువాలి. వృద్ధులు, చిన్నారులు, మధుమేహం బాధితులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

తూర్పుగోదావరి జిల్లాలో ఇలా..

సంవత్సరం కేసులు

2022 226

2023 160

2024 60

2025 32

2026 18

Advertisement
 
Advertisement
Advertisement