సుర్రో.. మొర్రో | - | Sakshi
Sakshi News home page

సుర్రో.. మొర్రో

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

ఎండల ధాటికి హడలిపోతున్న జనం

పగలు, రాత్రి ఒక్కటే ఉక్కపోత

నిర్మానుష్యమవుతున్న రహదారులు

రాజానగరం/రాయవరం: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇష్టానుసారంగా విద్యుత్‌ కోతలు విధించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతుండడంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత కూడా ఉష్టోగ్రత ప్రభావం తగ్గడం లేదు. 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అడపా దడపా వర్షాలు కురిసినా వాతావరణంలో వేడి ఏమాత్రం తగ్గడం లేదు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 39 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. దీంతో రాజానగరం వద్ద జాతీయ రహదారిపై కర్ఫ్యూ వాతావరణం దర్శనమిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహా లారీలు, ఆటోలు కూడా పెద్దగా తిరగని పరిస్థితులలో రాజానగరం, దివాన్‌చెరువు, లాలాచెరువు కూడళ్లు జన సంచారం లేక వెలవెలబోయాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరైతేనేగాని జనం బయటకు రావడం లేదు. ఆ సమయంలో దాహార్తిని తీర్చే కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌ల విక్రయాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయని విక్రయదారులు వాపోతున్నారు. ఎండలు ముదిరిపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement