● జగ్గంపేటలో జూడో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్
● ఉత్సాహంగా పాల్గొంటున్న 50 మంది విద్యార్థులు
జగ్గంపేట: వేసవి సెలవులను వృథాగా గడపకుండా విద్యార్థులకు మానసిక, శారీరక ఉల్లాసం కలగచేసేందుకు జిల్లా స్పోర్సు అథారిటీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జూడో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతోంది. జగ్గంపేటకు చెందిన జూడో జిమ్ కోచ్, బ్లాక్ బెల్ట్ 6డాన్ కరాటే మాస్టర్ తాండ్రోతు వెంకట రమణ విద్యార్థినీవిద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని కలగచేయడంతో పాటు భవిష్యత్తులో వారు మరింత శ్రద్ధగా శిక్షణ తీసుకుంటే మంచి క్రీడాకారులు కావచ్చని ఆయన తెలిపారు. జూడో ఫ్రీ కోచింగ్ ప్రారంభించి వారం రోజులు అయిందని, 50 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, ఈ క్యాంప్ ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని చెప్పారు. జూడో ఒలింపిక్ గేమ్ అని, దీనిలో శిక్షణ కొనసాగించి సబ్ జూనియర్, క్యాడిట్, జూనియర్, సీనియర్ విభాగాలలోను, స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాలలో పాల్గొనాలని సూచించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించి సర్టిఫికెట్లు సాధించగలిగితే ఉన్నత చదువులలోను, ఉద్యోగాలలోను స్పోర్ట్సు కోటాలో మేలు జరుగుతుందని వివరించారు.


