ఫ ఔరంగబాద్ ఇసుక రీచ్‌లో అక్రమాలు
ఫ ఒకే బిల్లుతో సాయంత్రం వరకూ రవాణా
ఫ అంతా టీడీపీ నేత కనుసన్నల్లోనే..
ఫ కన్నెత్తి చూడని అధికారులు
పెరవలి (కొవ్వూరు): ఇసుక అక్రమాలకు కొవ్వూరు మండలం ఔరంగబాద్ ఇసుక రీచ్‌లు అడ్డాగా మారాయి. ఇక్కడ పడవలపై ఇసుక తెచ్చే రెండు రీచ్‌లున్నాయి. కేవలం ఒక లారీకి బిల్లు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యథేచ్ఛగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పుల్లో ఇసుక తరలించుకుపోతున్నారు. అంతే కాదు, బిల్లు తీసుకుంటే ఒక రేటు.. లేకపోతే మరో రేటు వసూలు చేస్తున్నారు. ర్యాంప్ నిర్వాహకులు సమయం కూడా వేయకుండా బిల్లు ఇస్తున్నారు. ఇసుక లారీ రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎవరైనా అధికారులు నిలుపు చేస్తే, అప్పుడు బిల్లుపై డ్రైవర్ సమయం వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై రీచ్ నిర్వాహకులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు కూడా అదే సమయాన్ని బిల్లులో నమోదు చేస్తున్నారు. ఎవరైనా అధికారులు అడ్డుకోవాలనుకున్నా టీడీపీ నేత ఒకరు రంగంలోకి దిగి కాసులతో కట్టి పడేస్తున్నారు. అప్పటికీ ఎవరైనా ఎదురు తిరిగితే బదిలీ అనో, మరో పేరుతోనో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రూ.కోట్లలో దోపిడీ!
జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇక్కడ 20 టన్నుల ఇసుక లారీకి రూ.4,580 వసూలు చేయాలి. కానీ, కాస్త తగ్గించి ఔరంగబాద్ రీచ్‌లో రూ.4,300 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఇలా నష్టానికి వ్యాపారం చేస్తారా అనే అనుమానం రావచ్చు. కానీ, ఒకే బిల్లుపై సాయంత్రం వరకూ ఇసుక తరలించుకుని పోయి, పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. బిల్లు వద్దని అంటే రికార్డుల్లో ఏ వివరాలూ నమోదు చేయకుండా కేవలం రూ.4 వేలకే లారీ ఇసుక తరలిస్తున్నారు. ఈవిధంగా ఔరంగబాద్‌లోని రెండు రీచ్‌ల నుంచి రోజుకు 150 లారీలు, సుమారు 50 ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. రికార్డుల్లో మాత్రం 30 నుంచి 50 లారీలు మాత్రమే చూపిస్తున్నారు. దీంతో ఒక లారీకి (20 టన్నులు) రూ.4,300 చొప్పున రోజుకు రూ.6.45 లక్షలు, ట్రాక్టర్‌కు రూ.1,000 చొప్పున 50 ట్రాక్టర్లకు రూ.50 వేలు కలిపి దాదాపు రూ.7 లక్షల మేర కొల్లగొడుతున్నారు. ఈవిధంగా నెలకు రూ.2.10 కోట్ల మేర దోచుకుంటున్నారు. ఇక్కడ గోదావరి నదీగర్భం నుంచి నేరుగా పడవల్లో ఇసుక తీసుకువచ్చి గుట్టగా వేయడం.. దీనికి లెక్కా పత్రం లేకపోవటంతో టీడీపీలోని ఓ కీలక నేత కనుసన్నల్లోని ఇసుక మాఫియాకు కాసుల పంట పండుతోంది. ఇక్కడ బహిరంగంగానే ఇంత దందా సాగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ అధికారులు మాత్రం అడపాదడపా దాడులు చేసి, కేసులు నమోదు చేసి, కేవలం జరిమానాలతో సరిపెడుతున్నారు. ఔరంగబాద్ ఇసుక అక్రమాలపై ఉన్నతాధికారులు ఇప్పటికై నా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


