రసాయనాలతో మాగబెట్టి పండ్లు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

రసాయనాలతో మాగబెట్టి పండ్లు విక్రయిస్తే చర్యలు

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పండ్లను రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి విక్రయించే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ హెచ్చరించారు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మామిడి సహా వివిధ పండ్లను కాల్షియం కార్బైడ్‌ వంటి నిషేధిత రసాయనాలతో మాగబెట్టడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. సహజ పద్ధతుల్లో పండ్లు మాగబెట్టేలా వ్యాపారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రసాయనాలతో పండ్లు మాగబెట్టినట్లు గుర్తించిన వ్యాపారులకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

కారాగారాల్లో లీగల్‌ ఎయిడ్‌

హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు, మహిళా కారాగారాల్లో లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను శుక్రవారం ప్రారంభించారు. కారాగారాల్లో ఆహార ప్రమాణాలు, పరిశుభ్రత, ఖైదీలకు కల్పిస్తున్న ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయాలన్నా, పై కోర్టుల్లో అప్పీలు వేయాలన్నా, ఇతర న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామని వివరించారు. ఉచిత న్యాయ సహాయం పారా లీగల్‌ వలంటీర్లకు తమ అర్జీలు అందించాలని ఖైదీలకు సూచించారు.

నిమ్మ ధర పతనం

దేవరపల్లి: మార్కెట్లో నిమ్మ ధర మరింత పతనమైంది. గత నెలలో కిలో కాయలకు రూ.130 నుంచి రూ.140 వరకూ ధర పలికింది. ముదర కాపులు దిగుబడులు తగ్గడంతో కాయలకు డిమాండ్‌ ఏర్పడింది. గత డిసెంబర్‌, జనవరి నెలల్లో కిలో రూ.8 నుంచి రూ.10 మాత్రమే ధర పలకగా, ఫిబ్రవరిలో రూ.40, మార్చిలో రూ.70, ఏప్రిల్‌లో ఏకంగా రూ.140కి పెరిగింది. కొద్ది రోజుల అనంతరం ఈ నెలలో ధర క్రమేపీ పతనమవుతూ వస్తోంది. యాదవోలు మార్కెట్లో కాయల నాణ్యత, సైజును బట్టి శుక్రవారం కిలోకు రూ.20 నుంచి రూ.30 మాత్రమే ధర లభించిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం లేత కాపులు అందుకోవడంతో మార్కెట్‌కు రోజుకు సుమారు 25 టన్నుల కాయలు అమ్మకానికి వస్తున్నాయని వ్యాపారులు తెలిపారు.

వెబ్‌సైట్‌లో సీనియారిటీ

తాత్కాలిక జాబితా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ తాత్కాలిక జాబితాను డీఈఓ.జీఓవీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ఉంచామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మునిసిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్ల కింద పని చేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రధానోపాధ్యాయులు సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్‌) ఆధారంగా రూపొందించారని వివరించారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీ లోగా కాకినాడలోని పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

మహిళా కారాగారంలో లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ప్రారంభిస్తున్న డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement