మట్టి అక్రమ తవ్వకాలపై సర్వే | - | Sakshi
Sakshi News home page

మట్టి అక్రమ తవ్వకాలపై సర్వే

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

రంగంపేట: వడిశలేరు పాపాయ్య చెరువులో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. ఇరిగేషన్‌ ఏఈ వై.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ జి.విఘ్నేశ్వరరావు, రాజమహేంద్రవరం డీఎంఈజీఓ సర్వేయర్‌ పి.శ్రీనివాస్‌, మండల, గ్రామ సర్వేయర్లు బి.సత్తబ్బాయి, పి.నవీన్‌, వీఆర్‌ఓలు జె.పోచయ్య, ఎం.రామారావులు మధ్యాహ్నం 12 గంటలకు సర్వే ప్రారంభించారు. సుమారు 2 గంటల పాటు సర్వే నిర్వహించిన అనంతరం, అక్కడున్న గ్రామస్తులకు, రైతులకు ఎటువంటి వివరాలూ వెల్లడించకుండానే వెళ్లిపోయారు. మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులు, రైతుల సహకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు హెచ్చరించారు. అధికారుల సర్వేపై గ్రామస్తులు, రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ మేరకు అక్రమ మైనింగ్‌ జరిగిందనే వివరాలను సర్వే చేసిన అధికారులు చెప్పలేదని, దీనినిబట్టి ఎంత పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు. మట్టి అక్రమ తవ్వకాల వలన లోతు అంచనా వేయలేక చెరువులో మనుషులు, పశువులు మృత్యువాత పడితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అధిక లోడుతో తిరిగిన మట్టి టిప్పర్ల కారణంగా రోడ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతుల బులి వీర్రాజు, రైతులు నలమాటి భీముడు, సత్తి సత్తిబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement