ఫ వ్యవసాయ కూలీలకు
రూ.2 లక్షల చొప్పున పంపిణీ
ఫ 10 మందికి రూ.20 లక్షలు
అందించిన కౌలురైతు
కడియం: అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్‌పై ఉన్న భక్తితో.. ఆ మహనీయుని జయంతి వేళ.. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) వినూత్నంగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గ్రామంలోని కాటన్ విగ్రహానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం, తన వద్ద పని చేస్తున్న పది మంది వ్యవసాయ కూలీలకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందజేశారు. బీడువారిన భూముల్లో జలధార కురిపించి, ఏకంగా 10 లక్షల ఎకరాలను సిరులు పండే పంట భూములుగా మార్చిన కాటన్‌పై కందరెడ్డికి అపార భక్తి. తన ఇంటి ముందు 2004లో నిలువెత్తు కాటన్ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఏటా ఆ మహనీయుని జయంతి రోజున ఆ విగ్రహానికి ధాన్యాభిషేకం చేస్తారు. అంతే కాదు.. తాను కౌలుకు తీసుకున్న 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చే ఫల సాయంలో 50 శాతాన్ని కందరెడ్డి సామాజిక అవసరాలకే వెచ్చిస్తారు. కడియం మండలంలోని దుళ్ల, మురమండ, వీరవరం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులకు ఉపయోగించే మూడు ట్రాక్టర్లను రూ.18 లక్షలతో సమకూర్చారు. వీరవరం, దుళ్ల గ్రామాల్లో సుమారు రూ.40 లక్షలతో రెండు పార్కులు అభివృద్ధి చేశారు. పాఠశాలలకు, దేవాలయాలకు, చర్చిలకు భూరి విరాళాలిచ్చారు. దశాబ్ద కాలంగా సామాజిక అవసరాలకు, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. ఇంతటి అసామాన్య సేవలు అందిస్తున్న కందరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.


