● జిల్లాలో 26,915 ఎకరాల్లో
మొక్కజొన్న సాగు
● కానరాని కొనుగోలు కేంద్రాలు
● క్వింటాల్ మద్దతు ధర రూ.2,400
● దళారులిస్తున్నది రూ.1,650
● పట్టించుకోని ప్రభుత్వం
దేవరపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారి కానరాక అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము ఇబ్బందులు పడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 10,456 మంది రైతులు, 26,915 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, పెరవలి, సీతానగరం తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు జరిగింది. వాతావరణం అనుకూలించడం, చీడపీడలు లేకపోవడంతో ఈ ఏడాది దిగుబడులు దండిగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. దీంతో, పెట్టుబడులు పోనూ లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ, ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఫలితంగా మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదు. గత్యంతరం లేక రైతులు నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. సీజన్ ప్రారంభంలో క్విటాల్‌కు రూ.2,250 చెల్లించగా, రానురానూ ఆ ధరను దళారులు తగ్గించేశారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,450 నుంచి రూ.1,650 మాత్రమే చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ వేచి చూద్దామని భావించినా.. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు కరువవుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న కండెలను దాచుకుందామంటే గిడ్డంగి సదుపాయం లేదు. వర్షాలకు తడిస్తే పంటను అడిగే వారే కనిపించడం లేదు. గుండుగొలను – కొవ్వూరు మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లపై మొక్కజొన్న కండెలు ఆరబెడుతున్నారు. కొనుగోలుదార్ల కోసం రైతులు కళ్లాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎవరైనా కొనుగోలు చేసినా మద్దతు ధర దక్కకపోవడంతో ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోతున్నారు. కనీస పెట్టుబడి కూడా దక్కడం లేదని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు వాపోతున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్న రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,200 మద్దతు ధర ప్రకటించగా.. నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సొసైటీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఫలితంగా రైతుకు ఎకరాకు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల ఆదాయం వచ్చింది. అటువంటిది నేడు చంద్రబాబు సర్కారు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుకు కోలుకోలేని దెబ్బ
కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరం కౌలు రూ.50 వేలు, పెట్టుబడి రూ.40 వేలు కలిపి మొత్తం రూ.90 వేలు ఖర్చయ్యింది, ఎకరాకు దిగుబడి 40 నుంచి 45 క్వింటాళ్లు వచ్చింది. ధర లేక గిట్టుబాటు కాలేదు. క్వింటాల్ మద్దతు ధర రూ.2,400 ఉండగా, మొదట్లో రూ.1,950కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,650 మాత్రమే ఇస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల నష్టం వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరకు కొనుగోలు చేస్తే గిట్టుబాటు అయ్యేది. – వల్లభనేని కిషోర్, కౌలు రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం
గిట్టుబాటు ధర కల్పించాలి
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మొక్కజొన్న పంటకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలి.
– వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం


