పిడుగు పడి ఇద్దరి మృతి
అడ్డతీగల/రంపచోడవరం: పోలవరం జిల్లా డి.రామవరంలో గురువారం పిడుగుపడి ఉపాధ్యాయుడు సుమర్ల గుణ అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో వివాహానికి వెళ్లి వస్తూండగా.. వర్షం వస్తోందని డి.రామవరం శివారున మామిడి చెట్టు కిందకు చేరారు. అక్కడ నేరుగా పిడుగు పడటంతో గుణ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన సుమర్ల అబ్బాయిరెడ్డి, నాగేశ్వరరావు ఈ విషయం తెలిపారు. కాగా, మారేడుమిల్లి మండలం ఇవ్వాంపల్లికి చెందిన ఓ బాలుడు కూడా పిడుగు పడి మరణించాడు. గ్రామ సమీపంలోని కొండపోడు వద్ద తల్లి భూమమ్మతో కలసి ఉన్న కత్తుల తేజశ్వర్‌రెడ్డి (10)పై పిడుగు పడి మృతి చెందాడు. పక్కనే ఉన్న అతడి సోదరుడు సత్యనారాయణరెడ్డి అపస్మారక స్థితికి చేరుకోవడంతో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు.
రంప రోడ్డులో నేల కూలిన చెట్టు
దేవరపల్లి వద్ద పడిపోయిన విద్యుత్ స్తంభం
రంపచోడవరం: ఏజెన్సీలో గాలివాన బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాల్లో భయనక వాతావరణం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత పడడంతో పాటు అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. మారేడుమిల్లి – రంపచోడవరం రహదారిలో దేవరపల్లి వద్ద ప్రధాన రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంపచోడవరం సమీపంలోని రంప రోడ్డుపై చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో, రంప పర్యాటక ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. అధికార యంత్రాంగం చెట్లను తొలగించి, రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.


