వాడపల్లి వెంకన్నకు రికార్డు స్థాయి ఆదాయం | - | Sakshi
Sakshi News home page

వాడపల్లి వెంకన్నకు రికార్డు స్థాయి ఆదాయం

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

– 50 రోజులకు రూ 3.24 కోట్లు

ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా 50 రోజులకు రూ.3,24,82,615 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, గ్రూపు దేవాలయాల ఈఓలు పీవీవీఎస్‌ కామేశ్వరరావు, ఎం.సత్యనారాయణల సమక్షంలో గురువారం హుండీల ఆదాయం లెక్కించారు. శ్రీ విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.2,44,76,932, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.80,05,683 మేర ఆదాయం లభించిందని ఈఓ వివరించారు. బంగారం 73 గ్రాములు, వెండి 1,544 గ్రాములు, 14 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అర్చకులు, వేద పండితులు, శ్రీవారి సేవకులు, రావులపాలెం కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి ముఠా అరెస్టు

రంపచోడవరం: గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌డీపీఓ అష్రిఫ్‌ అలీ తెలిపారు. రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన కథనం ప్రకారం.. సీఐ ఎన్‌.సన్యాసినాయుడు, ఎస్సై రమేష్‌ రంప గ్రామంలో తనిఖీలు చేస్తున్నారు. నాలుగు బైక్‌లపై వస్తున్న 11 మంది వ్యక్తులు తనిఖీలను గమనించి వెనక్కి పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. రెండు బైక్‌లపై ఉన్న ఏడుగురిని పట్టుకున్నారు. మిగిలిన రెండు బైక్‌లపై నలుగురు తప్పించుకున్నారు. పట్టుబడిన వారి నుంచి 24 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒక గ్యాంగ్‌గా ఏర్పడి కాకినాడ జిల్లా పెద్దాపురం, కొయ్యూరు పరిధిలో అనేక బైక్‌లు, ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు తేలింది. వారి నుంచి ఆరు బైక్‌లు, 33 గ్రాముల బంగారం, 1.85 గ్రాముల కు పైగా వెండి, కెమెరా తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామర్లకోటకు చెందిన కొరిమిల్లి సురేష్‌, పి.వెంకట సత్యవరప్రసాద్‌, రొంగల సూర్యకిరణ్‌, షేక్‌ యాసిన్‌, సాయి, ఆర్‌.అఖిల్‌, ప్రసాద్‌, శివరామ దుర్గారెడ్డి, రంప గ్రామానికి చెందిన బాబ్లు, పెద్దబారంగికి చెందిన లిల్లీ, కుంజా సిద్ధులను అరెస్ట్‌ చేశారు.

కొత్తవీధి పరిధిలో

పులి సంచారం

రాజవొమ్మంగి: స్థానిక అటవీ క్షేత్రంలోని వయ్యేడు ఫారెస్ట్‌ బీట్‌లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఉషారాణి గురువారం రాత్రి తెలిపారు. వయ్యేడు అటవీ ప్రాంతానికి దగ్గరలోని కొత్తవీధి, కిమ్మిలిగెడ్డ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేశామన్నారు. కాగా పులి జనావాసాల్లో వచ్చే అవకాశం లేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement