● అధిక రక్తపోటుతో అనర్థాలు
● జిల్లాలో 1.15 లక్షల మంది బాధితులు
● 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే
రాయవరం: జీవన శైలి మారింది.. ప్రతి పనిలోనూ ఒత్తిడి పెరిగింది.. దీనివల్ల అధిక రక్తపోటు (బీపీ) బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. దీని కారణంగా గుండె, మెదడు, నరాలు, కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ అనారోగ్యం బారిన పడేస్తోంది. చాలా మందికి బీపీ ఉందన్న విషయాన్ని గమనించే లోపే జరిగే అనర్థం జరిగిపోతోంది. ఈ నెల 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్‌సీడీ కార్యక్రమం ద్వారా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి బీపీ బాధితులను గుర్తించారు. మొత్తం 18,11,758 మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా, 10,12,037 మందికి నిర్వహించారు. ఇందులో 1,15,100 మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. శరీరంలో రక్తాన్ని అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడి (ప్రెజర్) చేసి పంపిస్తోంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింపజేసే శక్తినే బ్లడ్ ప్రెజర్‌గా పేర్కొంటారు. ఒక వ్యక్తి గుండె సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెషర్ (బీపీ) 120/80గా పేర్కొంటారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్లు కూడా తెలియక పోవడం వల్ల ఉన్నట్లుండి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి బీపీ చెకప్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అసాధారణ రీతిలో 160/100, 170/110, 200/120 రావడంతో ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి మెదడు, గుండెలోనూ నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదముంది. ఇటీవల 20–30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కారణాలు.. లక్షణాలు
సాధారణంగా అధిక రక్తపోటు వయసు మళ్లిన వారికి వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా సంక్రమిస్తుంది.
ధూమపానం, ఊబకాయం, ఏ పనిచేయకుండా ఒకేచోట గంటల తరబడి ఉండడం, హైపో థైరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాట్లతో పాటు కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ద్వారా బీపీ వస్తుంది.
మెడ నరాల లాగేస్తున్నట్లు ఉండడం, కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచూ తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిర్లుగా ఉండడం బీపీ లక్షణాలు.
జాగ్రత్తలు తీసుకుంటే మేలు
హైపర్ టెన్షన్‌తో బాధపడే రోగులు ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉప్పును తక్కువగా వినియోగించాలి. మసాలాలు, నిల్వ పచ్చళ్లు, కారం తగ్గించాలి. ప్రతి రోజూ గంట పాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఎన్‌సీడీ సర్వే ద్వారా గుర్తింపు
అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ఎక్కువగా అధిక రక్తపోటు కేసులు నమోదవుతున్నాయి. వైద్యుల సూచనలు పాటిస్తూ బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రించుకోవచ్చు.
–డాక్టర్ జి.హరిశ్చంద్రప్రసాద్, ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారి
ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం
ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార శైలితో అధిక రక్తపోటును అధిగమించవచ్చు.
–ఎన్.వసుంధర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, తూర్పుగోదావరి


