రత్నగిరిపై భక్తుల కోసం ‘ఫ్రీ వైఫై’ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తుల కోసం ‘ఫ్రీ వైఫై’

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు వ్రతం, ప్రసాదం, ఇతర సేవా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వీలుగా ‘ఫ్రీ వైఫై’ అందుబాటులోకి తెచ్చారు. గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘క్యాష్‌ ట్రబుల్‌’ శీర్షికన కథనం ప్రచురితమైంది. డిజిటల్‌ పేమెంట్స్‌ మాత్రమే దేవస్థానంలో అమలు చేస్తూ, నగదు తీసుకోవడం మానేయడంతో ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించి రామాలయం సమీపంలో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద, పశ్చిమ రాజగోపురం సమీప బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ప్రీ వైఫే అందుబాటులోకి తెచ్చారు. సెల్‌ ఫోన్‌లో వైఫైని టచ్‌ చేస్తే ‘అన్నవరం ఫ్రీ వైఫై’ ఓపెన్‌ అవుతుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఆటోమెటిక్‌గా సెల్‌కు వైఫై కనెక్ట్‌ అవుతుందని అధికారులు తెలిపారు. అదే విధంగా అన్ని కౌంటర్లలో వైఫై త్వరగా కనెక్ట్‌ అయ్యేందుకు రూటర్స్‌ కూడా అమర్చనునట్లు వివరించారు. కాగా, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంపై కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌ కూడా స్పందించి దేవస్థానం అధికారులను వివరణ కోరారు.

నేడు మంత్రి లోకేష్‌ ఇంటికి

శాంతియుత ర్యాలీ

రాజమహేంద్రవరం రూరల్‌: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ఇంటికి శాంతియుత పాదయాత్ర నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెప్పిలి రఘునాథ్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్‌ ఇంటికి ర్యాలీ చేపడతామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా లోకేష్‌ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలయ్యే వరరూ పోరాటం కొనసాగుతుందని రఘునాథ్‌ స్పష్టం చేశారు.

విద్యుదాఘాతానికి

వ్యక్తి దుర్మరణం

చింతూరు: ఏడుగురాళ్లపల్లిలో బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ గ్రామంలో వలిపిరెడ్డి నిరంజన్‌ (43) రాత్రి 11 గంటల సమయంలో తన బడ్డీ కొట్టును గునపంతో జరిపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బడ్డీకి విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో నిరంజన్‌ షాక్‌కు గురయ్యాడు. అతన్ని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు.

పార్కింగ్‌ విషయంలో గొడవ

మహిళ మృతి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పార్కింగ్‌ విషయంలో పడిన గొడవలో ఓ మహిళ మృతి చెందింది. దీనిపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. ఆ వివరాల ప్రకారం.. స్థానిక తుమ్మలావకు చెందిన ఇమ్మంది వెంకటరత్నం (55) ఓ భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. అదే భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి నెల క్రితం మురుకుర్తి శ్రీనివాస్‌ అద్దెకు దిగారు. ఇదిలా ఉండగా ఈ రెండు కుటుంబాలకు భవనంలో పార్కింగ్‌ విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇమ్మంది వెంకటరత్నంను శ్రీనివాస్‌ రెండో కుమారుడు చేతితో తోసేశాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయింది. వెంటనే ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుడు ఇమ్మంది శివనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement