పీకకోసి.. హత్యచేసి | - | Sakshi
Sakshi News home page

పీకకోసి.. హత్యచేసి

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

హత్య కేసులో నిందితుడి హతం

ప్రతికార చర్యలో భాగమేనని అనుమానం

చింతూరు: ఓ హత్య కేసులో నిందితుడు హతమయ్యాడు.. అతని పీకకోసి, హత్య చేయడం కలకలం రేపింది.. ఈ ఘటన చింతూరు మండలం లక్కవరంలో గురువారం చోటుచేసుకుంది. గతేడాది ఆగస్టులో మంత్రాలు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో లక్కవరానికి చెందిన మూట రామయ్య (60) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గ్రామానికి చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. ప్రస్తుతం వీరికి గతేడాది డిసెంబర్‌లో బెయిల్‌ మంజూరు కావడంతో గ్రామంలోనే ఉంటున్నారు. నలుగురు నిందితుల్లో ఒకరైన మూట రమేష్‌ (37)ను ప్రస్తుతం గుర్తు తెలియని వ్యక్తులు పీకకోసి దారుణంగా హతమార్చారు. గ్రామంలోని అంగన్‌వాడీ భవనం వెనుక రమేష్‌ మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు మోతుగూడెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నాసిర్‌ హుస్సేన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు

లక్కవరంలో బుధవారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకకు తన భర్త రమేష్‌తో కలసి వెళ్లినట్లు గంగమ్మ తెలిపింది. రాత్రి 10 గంటల వరకూ తాను కూడా అక్కడే ఉన్నానని, పిల్లలు నిద్రిస్తున్న నేపథ్యంలో ఇంటికి వెళ్దామని భర్తను పిలిచినట్లు ఆమె తెలిపింది. కాగా డీజే డ్యాన్స్‌ జరుగుతుండడంతో తాను ఇంకొంత సమయం ఇక్కడేసుంటానని తన భర్త చెప్పడంతో తాను ఇంటికి వెళ్లిపోయినట్లు గంగమ్మ తెలిపింది. ఉదయం తాను నిద్రలేచి భర్త ఇంటికి రాని విషయం గమనించి బంధువులకు ఫోన్‌ చేసినా ఆచూకీ తెలియలేదని ఆమె పేర్కొంది. అనంతరం బంధువుల సాయంతో ఊరిలో గాలిస్తున్న క్రమంలో అంగన్‌వాడీ భవనం వెనుక తన భర్త మృతదేహం పడి ఉన్నట్లు తెలిసిందని ఆమె తెలిపింది. హత్య కేసులో జైలుకు వెళ్లిన తన భర్త ఇటీవలే బెయిల్‌పై వచ్చాడని, ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుందని గంగమ్మ వాపోయింది.

దర్యాప్తు కొనసాగుతోంది

ఈ సంఘటనా స్థలాన్ని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్‌ పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. బుధవారం రాత్రి ఏం జరిగిందనే దానిపై ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతోందని, గతేడాది జరిగిన రామయ్య హత్య కేసులో రమేష్‌ నిందితుడు కావడంతో ప్రతీకార హత్య కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement