● వెనుకబడిన విద్యార్థులకు ‘విద్యాదాన్’
● జూన్ 20 వరకు దరఖాస్తులకు గడువు
రాయవరం: చదువులో ముందుండి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తోంది. కళాశాల విద్యలో సత్తా చాటేవారికి ఈ సాయం ఒక వరంలా మారనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలవుతోంది. ఎంపికై న విద్యార్థులు రెండేళ్ల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్‌షిప్ పొందవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదవడానికి స్కాలర్‌షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, కాల పరిమితి ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకూ స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్‌కు అవసరమైన దిశా నిర్దేశం చేస్తారు.
దరఖాస్తుకు అర్హత ఇదీ..
● సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం పొందడానికి విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి.
● 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్ చదువుతున్న వారు అర్హులు.
● పదో తరగతిలో కనీసం 90 శాతం మార్కులు సాధించాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు పొందాలి.
ఎంపిక విధానం ఇలా..
చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. జూలై 5న దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. విద్యాదాన్ ఉపకార వేతనం కోసం జూన్ 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు పదో తరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం, చదువుతున్న కళాశాల వివరాలు పొందుపర్చాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ– మెయిల్ కలిగి ఉండాలి. నెట్ సెంటర్ లేదా ఇతరుల ఈ– మెయిల్ ఐడీలను అనుమతించరు. భవిష్యత్తులో ఎస్‌డీఎఫ్ నుంచి ఎటువంటి సమాచారమైనా ఈ–మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అందుకే సొంత ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకుని, పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం మధ్యలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యాదాన్.ఆంధ్రఎస్‌డీ ఫౌండేషన్‌ఇండియా.కామ్‌లో సంప్రదించాలి. లేదా హెల్ప్‌లైన్ +919663517131 నంబరు ఫోన్ ద్వారా సంప్రదించాలి.


