ఆ కుటుంబానికి తీరని షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబానికి తీరని షాక్‌

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

బాలుడిని కబళించిన విద్యుత్‌

శోకసంద్రంలో మాతృమూర్తి

గండేపల్లి: ఆ కుటుంబానికి విద్యుత్‌ తీరని షాక్‌ ఇచ్చింది. చేతికి అందివస్తున్న కొడుకును మింగేసింది. కన్న తల్లికి గుండెకోతను మిగిల్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గండేపల్లి మండలం కె.నాయకంపల్లికి చెందిన సేవా జ్యోతిబాబు, గంగాభవాని దంపతులకు తొలుత ఇద్దరు ఆడ శిశువులు, రెండోసారి ఇద్దరు ఆడ శిశువులు, మూడో కాన్పులో ఇద్దరు మగ శిశువులు జన్మించారు. ఆ కుటుంబంలో ఆ ఆనందం కొన్ని రోజులకే నిలిచింది. కొన్నాళ్లకు తొలి కాన్పులో జన్మించిన ఇద్దరిలో ఒకరు, రెండో కాన్పులో జన్మించిన ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. ఆ బాధను దిగమింగుకుని జీవితాన్ని వెళ్లబుచ్చుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, నాటి నుంచి అన్నీ తానై అనేక కష్టాలను ఎదుర్కొంటూ నలుగురు పిల్లలను గంగాభవాని పెంచుకుంటుంది. మగ కవల్లో పెద్ద వాడైన రాకేష్‌, చిన్న వాడైన బాల లోకేష్‌ అనే పండు (16) ఇటీవల పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కవలల్లో ఒక్కొక్కరుగా మిగిలిన మల్లిక నర్సింగ్‌ చేస్తుండగా, సుచిత్ర ఇంటర్‌ పూర్తి చేసినట్టు తెలిసింది.

తల్లికి తోడుగా ఉంటూ..

చిన్న వయసులోనే తండ్రి మృతి చెందడంతో తల్లి కష్టాన్ని కళ్లారా చూస్తున్న రాకేష్‌, లోకేష్‌లు చదువుకుంటూ కూలి పనులు చేస్తూ తల్లికి ఆర్థికంగా చేదోడుగా ఉంటున్నారు. ఇందులో భాగంగా గురువారంలోకేష్‌ సూరంపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ కళాశాలకు వేరే వ్యక్తి ద్వారా సెంట్రింగ్‌ పనికి హెల్పర్‌గా వెళ్లాడు. పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురికావడంతో తోటి సిబ్బంది కళాశాల వాహనంపై పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి కళాశాల యాజమాన్యం న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు మృతదేహంతో ఆ కళాశాల ఎదుట ఏడీబీ రోడ్డుపై బైఠాయించారు. గ్రామ పెద్దలతో చర్చల అనంతరం న్యాయం చేస్తామంటూ కళాశాల యాజమాన్యం మాట ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. సీఐ బి.తిరుపతి, గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా తమ్ముడు అంటూ మృతుడి ఇద్దరు అక్కలు, అన్న విలపిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement