తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

మామిడికుదురు: ఈదరాడలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో ఏ విధమైన వస్తువులు లేకపోవడంతో సామగ్రిని చిందర వందరగా పడేసి వెళ్లిపోయారు. మరో ఇంటి బీరువాలో భద్రపరిచిన వెండి వస్తువులను అపహరించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈదరాడకు చెందిన ఆకుల విజయ శ్రీరాములు 20 రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్‌ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి దొంగలు ఆ ఇంటిని టార్గెట్‌ చేశారు. ఆ ఇంటి తాళాలు బద్దలు గొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. బాధితుడు గురువారం హైదరాబాద్‌ నుంచి వచ్చారు. అతని సమక్షంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. బీరువాలు బద్దలు గొట్టి వాటిలోని వెండి వస్తువులను అపహరించారు. బంగారం ఉన్న లాకర్‌ ఓపెన్‌ కాలేదని చెబుతున్నారు. ఈ ఇంటికి దగ్గరలోనే ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు యెనుముల భాస్కరరామ్మూర్తి ఇంటి తాళాలు కూడా బద్దలు గొట్టి చోరీకి ప్రయత్నించారు. కానీ ఆ ఇంట్లో ఏవిధమైన వస్తువులు లభించకపోవడంతో వెళ్లిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement