ఏకాదశి వేళ.. ఆధ్యాత్మిక హేల
భీష్మ ఏకాదశి వేళ ఆలయాలకు ఉత్సవ శోభ వచ్చింది.. ఊరూవాడా ఆధ్యాత్మికతను నింపింది.. ఉమ్మడి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి దేవస్థానాలు, పుట్టకొండ, ధవళేశ్వరం తదితర ఆలయాల వద్ద రథోత్సవాలతో భక్తజన కోలాహలం నెలకొంది. అలాగే రత్నగిరి కిక్కిరిసింది. ఇక్కడ విశేష సంఖ్యలో వ్రతాలు జరిగాయి.
అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం రత్నగిరి సత్యదేవుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేల మంది రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిశాయి. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరిచి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. తెల్లవారు జామున రెండు గంటల నుంచి స్వామివారి వ్రతాలను ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో స్వామివారి అంతరాలయ దర్శనం మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. వ్రత మండపాలు నిండిపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. భక్తులకు సర్క్యూలర్ మండపంలో ఉదయం ఆరు గంటల నుంచి పులిహోర, దద్దోజనం, మధ్యాహ్నం నుంచి కదంబం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజే దేవస్థానానికి రూ.70 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. స్వామివారి వ్రతాలు 7,377 జరగ్గా, వ్రతాల ద్వారా సుమారు రూ. 30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ద్వారా సుమారు రూ.18 లక్షలు వచ్చింది. మిగిలిన విభాగాల ద్వారా రూ. 22 లక్షల ఆదాయం వచ్చిందని వారు వివరించారు.
ఆకర్షణీయంగా పుష్పాలంకరణ
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు దాత వీర్ల రాంబాబు దంపతులు అందజేసిన లక్ష చామంతులతో పుష్పార్చన జరిగింది.
ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లతో భక్తుల నియంత్రణ సాధ్యపడింది. బుధవారం రాత్రి నుంచి వ్రతాల టిక్కెట్లు విక్రయించి గురువారం వేకువజాము నుంచి వ్రతాలు ప్రారంభించడంతో రద్దీ తగ్గింది. కాగా, సత్యదేవుని సన్నిధికి విచ్చేసిన చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీని ఈఓ త్రినాథరావు పంపిణీ చేశారు. సుమారు 200 మంది చిన్నారులకు వీటిని అందజేశారు. అయితే రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ ప్రముఖ ఆలయాలు కిటకిట
ఫ పలుచోట్ల రథోత్సవాలు
ఫ రత్నగిరికి పోటెత్తిన భక్తులు
ఏకాదశి వేళ.. ఆధ్యాత్మిక హేల
ఏకాదశి వేళ.. ఆధ్యాత్మిక హేల


