సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కడియం: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి గదిలో ఉన్న చాంబర్‌లో రూ.79 వేలు లభించింది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది చాంబర్లలో రూ.1,03,210ను ఏసీబీ అధికారులు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మొత్తంగా లభించిన రూ.1,82,210 నగదు లెక్క తేలనిదిగా గుర్తించారు. నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ చేశారా, తక్కువ ధరకు వాల్యుయేషన్ చేశారా, అనధికార రిజిస్ట్రేషన్ చేశారా అనే విషయాలపై తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ విషయాలపై తదుపరి విచారణ చేపడతామన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ఎవరైనా లంచాలు కోసం డిమాండ్ చేస్తే టోల్ ప్రీ నంబర్ 1064, ఏసీబీ డీఎస్పీ 94404 46160 ఫోన్ నంబరుకు తెలియజేయాలని కిశోర్‌కుమార్ తెలిపారు. లక్ష్మి గతంలో కాకినాడ, ప్రత్తిపాడు, కాకినాడ చిట్ రిజిస్ట్రార్, అమలాపురం, పెద్దాపురంలో సబ్–రిజిస్ట్రార్ (గ్రేడ్–2)గా పనిచేశారు. సబ్–రిజిస్ట్రార్ (గ్రేడ్–1)గా పదోన్నతి పొందిన తర్వాత, ఆమె సామర్లకోటలో పనిచేసి, అక్టోబర్ 2024 నుంచి కడియంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


