వీడని చిక్కుముడులు | - | Sakshi
Sakshi News home page

వీడని చిక్కుముడులు

Jan 29 2026 6:16 AM | Updated on Jan 29 2026 6:16 AM

వీడని చిక్కుముడులు

వీడని చిక్కుముడులు

మండపేట నియోజకవర్గ

స్వరూపమిదీ..

నియోజకవర్గ కేంద్రం మండపేట

మండలాలు మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం

గ్రామాలు 43

మున్సిపాలిటీ మండపేట (30 వార్డులు)

జనాభా 2,65,944

కుటుంబాలు 98,423

ఓటర్లు 2,20,418

పురుషులు 1,07,175

మహిళలు 1,13,237

ఇతరులు 6

పోలీస్‌ సర్కిళ్లు మండపేట పట్టణం, మండపేట రూరల్‌

పోలీస్‌ స్టేషన్లు మండపేట పట్టణం, ద్వారపూడి,

అంగర, రాయవరం

మండపేట విలీనంతో

‘తూర్పు’ ముఖచిత్రం

జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం

జనాభా 20,98,276

ఓటర్లు 15,31,161

నియోజకవర్గాలు 8

అటవీ ప్రాంతం 89.9 చదరపు కిలోమీటర్లు

రెవెన్యూ డివిజన్లు 2 (రాజమహేంద్రవరం, కొవ్వూరు)

మండలాలు 22 (రాజమహేంద్రవరం డివిజన్‌ 13, కొవ్వూరు డివిజన్‌ 9)

మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1 (రాజమహేంద్రవరం)

మున్సిపాలిటీలు 3 (కొవ్వూరు, నిడదవోలు, మండపేట)

గ్రామ పంచాయతీలు 343

ఫ ‘తూర్పు’లో ఇటీవల మండపేట విలీనం

ఫ నేటికీ శాఖల మధ్య కానరాని సమన్వయం

ఫ ఆర్డీఓ కార్యాలయానికి పెరిగిన దూరం

ఫ రామచంద్రపురం, ఆలమూరు కార్యాలయాలు ప్రశ్నార్థకం

ఫ విద్య, వైద్యం తదితర శాఖలు ఇప్పటికీ కోనసీమలోనే..

కపిలేశ్వరపురం: పాలనాపరమైన నిర్ణయాలు ప్రజల మేలుకోరి ఉండాలి. అలా కానప్పుడు ఫలితాలు లోపభూయిష్టంగా మారుతాయి. మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల పాలన, రెవెన్యూ వ్యవహారాలను కోనసీమ నుంచి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అయితే, ఈ క్రమంలో అనేక చిక్కుముడులను ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు. దీంతో, కొత్త జిల్లాలోకి మారినా మండపేట ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

సమస్యలెన్నో..

కోనసీమ జిల్లాలో ఉన్నప్పుడు మండపేటకు ఆర్‌డీఓ కార్యాలయం 12 కిలోమీటర్ల దూరంలోని రామచంద్రపురంలో ఉండేది. ‘తూర్పు’లో విలీనం కావడంతో రాజమహేంద్రవరంలోని ఆర్‌డీఓ కార్యాలయానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

కోనసీమలో జిల్లాలో ఉన్నప్పుడు కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక గ్రామ ప్రజలు 18 కిలోమీటర్లు ప్రయాణంతో అమలాపురంలోని కలెక్టరేట్‌కు చేరుకునేవారు. ‘తూర్పు’లో విలీనం కావడంతో ఇప్పుడు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌కు వెళ్లాలంటే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కేదారిలంక గ్రామస్తులు సైతం దూరాభారంతో సతమతమవుతున్నారు.

మండపేట నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు ఇప్పటికీ కోనసీమ జిల్లాలోనే కొనసాగుతున్నాయి. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖలు మాత్రం ‘తూర్పు’ పరిధిలో చేరాయి. దీంతో, ఆయా శాఖల ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది.

గణతంత్ర దినోత్సవం నాడు కొందరు ఉద్యోగులు రాజమహేంద్రవరంలో, మరికొందరు అమలాపురంలో అవార్డులు అందుకున్నారు.

ఈ నియోజకవర్గం కోనసీమ జిల్లాలో ఉన్నప్పుడు ఆ జిల్లా ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడంలేదు. కేశవరం పీహెచ్‌సీ వైద్యాధికారి సీహెచ్‌ రమ్యశ్రీ సిబ్బందిని వేధిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కోనసీమ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆమెను ద్వారపూడి పీహెచ్‌సీకి బదిలీ చేశారు. జిల్లా మార్పు తర్వాత ఆ ఉత్తర్వులు బుట్టదాఖలయ్యాయి. దీంతో, ఆమె ఇప్పటికీ కేశవరంలోనే కొనసాగుతున్నారు.

మండపేట ‘తూర్పు’లో విలీనం కావడంతో రామచంద్రపురంలోని ఆర్‌డీఓ కార్యాలయం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆ డివిజన్‌లో రామచంద్రపురం, కె.గంగవరం మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు మండలాల కోసం ఆ రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించడం విచిత్రం. ఈ పరిస్థితుల్లో దీని మనుగడ ఎప్పటికై నా ప్రశ్నార్థకమే అవుతుందన్న వాదన ఉంది.

మరోవైపు కోనసీమ జిల్లా పరిధి ఆలమూరులోని ప్రభుత్వ కార్యాలయాల విషయంలో సైతం గందరగోళం నెలకొంది. ప్రస్తుతం మండపేట, కపిలేశ్వరపురం మండలాల న్యాయపరమైన అంశాల విచారణ ఆలమూరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, జేఎఫ్‌సీఎం కోర్టుల పరిధిలో జరుగుతోంది. ఈ రెండు మండలాలు ఇప్పుడు రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవం తూర్పు జోన్‌ డీఎస్పీ పరిధిలోకి వెళ్లాయి.

కపిలేశ్వరపురం మండల పరిధి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఆలమూరు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్నాయి. జిల్లా మార్పుతో రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిని కూడా మార్చే చాన్స్‌ ఉంటుంది. అప్పుడు ఆలమూరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధి పరిమితమైపోతుంది.

మండపేట, కపిలేశ్వరపురం మండలాల వ్యవసాయ శాఖ కార్యకలాపాలు ఆలమూరు సహాయ సంచాలకుడి (ఏడీఏ) పరిధిలో ఉన్నాయి.

సబ్‌ ట్రెజరీ, ఎకై ్సజ్‌ కార్యాలయాల పరిస్థితి సైతం ఇలానే ఉంది. వీటి పరిధిపై స్పష్టత లేకపోవడం, పాలనా పరంగా ఒక జిల్లాలో.. శాఖల పరంగా మరో జిల్లాలో కొనసాగుతూండటంపై సర్వత్రా గందరగోళం నెలకొంది.

ఉమ్మడి జిల్లా నేపథ్యమిదీ..

పూర్వపు అవిభక్త ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 1925 ఏప్రిల్‌ 15న జీఓ 502 ద్వారా ఏర్పాటైంది. ఆ జిల్లాలో 1,103 గ్రామాలుండేవి. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్కడక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని మండలాలను వారు కోరుకున్న జిల్లాల్లోనే ఉంచింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌ 4న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. ఆ విధంగా అమలాపురం కేంద్రంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఏర్పాటైంది. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌లోని మండపేట నియోజకవర్గం ఈ కొత్త జిల్లా పరిధిలోకి వెళ్లింది.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మండపేటకు జిల్లా కేంద్రం అమలాపురం దూరాభారమనే పేరుతో మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలనే వాదనను మండపేటలో కొందరు తెర పైకి తెచ్చారు. అదే సమయంలో కోనసీమ జిల్లా నుంచి మండపేటను విడదీయ వద్దంటూ గత డిసెంబర్‌ 1న అమలాపురం కలెక్టరేట్‌ వద్ద చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యాన వ్యాపారులు నిరసన తెలిపారు. కారణాలేవైనప్పటికీ గత డిసెంబర్‌ 31 నుంచి కోనసీమ జిల్లా నుంచి మండపేట విడివడి ‘తూర్పు’లో విలీనమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement