కూటమి పాలనలో మహిళలపై వేధింపులు
● జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ను
సస్పెండ్ చేయాలి
● మాజీ హోం మంత్రి తానేటి వనిత
దేవరపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరిగాయని, జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారమే దీనికి నిదర్శనమని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైల్వేకోడూరు మహిళను శారీరకంగా, మానసికంగా వేధించిన ఎమ్మెల్యే శ్రీధర్‌ను జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. ఇన్ని జరుగుతున్నా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వాపోయారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ ఎన్నో కష్టాలను తట్టుకుని, ఇబ్బందులను ఓర్చుకుని, బెదిరింపులను దాటుకుని.. తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో విడుదల చేసిందన్నారు. కానీ ఇంత వరకూ హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.
స్పందించని పవన్
లైంగిక దాడులకు పాల్పడితే తాట తీస్తామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తానేటి వనిత ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఓ వివాహితను దారుణంగా వేధించి, దౌర్జన్యానికి తెగబడడం బాధాకరమన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చేస్తున్న ఇబ్బందికరమైన సంఘటనలను ఖండించి, ఎవరైతే జనసేన నాయకుల వల్ల ఇబ్బంది పడ్డారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలా రక్షణ లభించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఆ పార్టీల నాయకులు స్పందించడం లేదన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఓ ప్రభుత్వ ఉద్యోగి మహిళని వేధించగా ఆమె బయటకు వచ్చి చెప్పిందన్నారు. కానీ సతీష్‌పై చర్యలు తీసుకోకపోగా, బాధిత మహిళపైనే కేసు పెట్టడం విచిత్రమన్నారు.


