డీఆర్‌డీఏ సెర్ప్ పీడీగా నగేష్
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా డీఆర్‌డీఏ సెర్ప్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బి.నగేష్ బుధవారం బొమ్మూరు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం రామదాసు కో ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం డీఆర్‌డీఏ సెర్ప్ ఇన్‌చార్జి పీడీగా నియమించింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన ఎన్‌వీవీఎస్ మూర్తిని ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్‌గా, ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డిప్యూటేషన్‌పై నియమించారు. నగేష్ గతంలో జిల్లా పరిషత్ సీఈవోగా, జిల్లా పంచాయతీ అధికారిగా, జిల్లా సహకార అధికారిగా విధులు నిర్వహించారు. ముందుగా ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
భక్తిశ్రద్ధలతో గంధోత్సవం
రాయవరం: పసలపూడిలోని నాగూర్ బాబా దర్గాలో బుధవారం గంధోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్గా నిర్వాహకుడు ఖాదర్ వలీ బాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ముస్లింలు గంధపు బిందెలతో గ్రామోత్సవం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లింలు దర్గాలో ప్రార్థనలు జరిపారు. నాగూర్‌బాబాను కీర్తిస్తూ ఆలపించిన గజల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నేడు జనార్దనస్వామి కల్యాణం
ధవళేశ్వరం: గ్రామంలోని ధవళగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ జనార్దనస్వామి వారి కల్యాణం గురువారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది. అంతకముందు తెల్లవారుజామున 3 గంటలకు విశేష అర్చనలు, ఉదయం 11.45 గంటలకు రథ సంప్రోక్షణ చేస్తారు. స్వామివారి రథోత్సవాన్ని మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభించనున్నారు. రథం వీధి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఫిబ్రవరి 2వ తేది వరకు స్వామివారి కల్యాణో
త్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ దాసరి చిన్న రమణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి జోగి వెంకటేశ్వరరావు తెలిపారు.
వాడపల్లిలో సీల్డ్ టెండర్లు
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో షామియానా ఏర్పాటు, వివిధ దుకాణాల నిర్వహణకు బుధవారం సీల్డ్ టెండర్లు నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేసే హక్కుకు, అలాగే శ్రీనివాస ప్రాంగణంలో రెండు తాత్కాలిక షాపులకు (మూడేళ్ల కాలపరిమితి), లడ్డూ బాక్సులు సరఫరా చేసే హక్కుకు ఈ టెండర్లు నిర్వహించారు. లడ్డూ బాక్సులకు సంబంధించి ఒకటిని రూ.3.98కి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన విజయవాడకు చెందిన మణికంఠ ఏజెన్సీకి ఖరారు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మన సాయి ప్రసాద్, శిష్టా సూర్య కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
రూ.కోటితో అభివృద్ధి పనులు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రూ.కోటి వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని దేవస్థానం పాలకమండలి తీర్మానించింది. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఏకసభ్య పాలకమండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈఓ వేండ్ర త్రినాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొండ దిగువన మొదటి ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మించేందుకు, మెట్లకు ఇరువైపులా పిట్టగోడ, భక్తులు కూర్చునేందుకు వీలుగా ఫ్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి రూ.40 లక్షల అంచనాతో టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ ఇంజినీరింగ్ వర్క్స్ 27.27 శాతం తక్కువకు టెండర్ దాఖలు చేసింది. ఆ సంస్థకు పనులు అప్పగించాలని నిర్ణయించారు.
డీఆర్‌డీఏ సెర్ప్ పీడీగా నగేష్
డీఆర్‌డీఏ సెర్ప్ పీడీగా నగేష్


