గ్రేటర్ ఫ్లెమింగోల కనువిందు
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పరిధిలోని హోప్ ఐలాండ్ దీవిలో గ్రేటర్ ఫ్లెమింగోలు సందడి చేశాయి. సుమారు 70 ఫ్లెమింగోల గుంపు కనువిందు చేసింది. కోరింగా వన్యప్రాణి అభయారణ్యంలో యేటా జనవరిలో పక్షుల గణన చేపడతారు. ఈ నెల 6,7,8 తేదీలలో నిర్వహించిన పక్షుల గణనలో ఫ్లెమింగోల జాడ కనిపించలేదు. అయితే మంగళవారం హోప్ ఐలాండ్ దీవిలో 65 నుంచి 70 ఫ్లెమింగోలు మందను కనుగొన్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ తెలిపారు. గత ఏడాది కేవలం ఒక్క ఫ్లెమింగో మాత్రమే కనిపించిందని, ఈ ఏడాది ఈ స్థాయిలో ఫ్లెమింగోలు రావడం శుభపరిణామన్నారు. కోరింగా అభయారణ్యంలోని చిత్తడి నేలలు వలస పక్షుల రాకకు అనుకూల వాతావరణంలో ఉన్నట్లు తెలియజేశారు. ఇలా ఉండగా ఈ ఏడాది (2026) కోరింగా వన్యప్రాణి అభయారణ్యంలో నిర్వహించిన పక్షుల గణనలో 44,298 పక్షులను గుర్తించామన్నారు. గత ఏడాది(2025) 39,724 పక్షులను గుర్తించగా, 2024లో 43,131 పక్షులను గుర్తించామని వరప్రసాద్ తెలిపారు.


