మైనారిటీలపై పథకం ప్రకారం దాడులు
జగ్గంపేట: చంద్రబాబు ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఓ పథకం ప్రకారం మత విద్వేషాలు రగిలిస్తూ, మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ ఆరోపించారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీలపై దాడుల్లో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని, దీనికి ప్రధాన కారణం చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. న్యాయ వ్యవస్థను సైతం కూటమి నేతలు ధిక్కరించే దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక, ల్యాండ్, మైనింగ్ మాఫియాలతో చేతులు కలిపి దోచుకు తింటున్నారని, దీంతో పరిపాలన గాడి తప్పిందని, నియంతృత్వ, కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీల రూపంలో సంఘ వ్యతిరేక శక్తులు మైనారిటీలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఓ మంత్రి పాత్ర ప్రముఖంగా కనిపిస్తోందని జాన్‌వెస్లీ ఆరోపించారు. గతంలో ఆయన శాఖ ద్వారా రాష్ట్రంలో అనుమతులున్న చర్చిలు ఎన్ని, లేనివి ఎన్ననే సమాచారం సేకరించారని, దీనిపై క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తాత్కాలికంగా మౌనం వహించారని చెప్పారు. కానీ, ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. గొల్లప్రోలు, సత్యసాయి, అనంతపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, విశాఖ జిల్లా భీమిలిల్లో చర్చిలు, క్రైస్తవ మత సంఘాలు, ప్రభువును నమ్ముకున్న వారిపై జరిగిన దాడులే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేక, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని తాము చేసినట్లు చెప్పుకొంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని, భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ డేటా సెంటర్లే దీనికి ఉదాహరణగా నిలుస్తాయని జాన్‌వెస్లీ అన్నారు. విలేకర్ల సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్‌వెస్లీ, కార్యదర్శి మోర్తా శ్రావణ్ కుమార్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు జడాల జాషువా గిరి, విజయ సారథి, నేతలు గుడాల శాంతిప్రసాద్, ఐ.షాలెమ్. టి.తిమోతి, పలువురు క్రిస్టియన్ సంఘ నేతలు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాన్‌వెస్లీ


