నేత్రపర్వంగా గ్రామోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకు హనుమద్వాహనం, రాత్రి 8 గంటలకు సింహవాహనంపై గ్రామోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. వాహనాలపై కొలువుదీరిన స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5–30 నుంచి 7 గంటల వరకూ స్వామివారి తిరువారాధన, ఆర్జిత అభిషేకం, బాలభోగం అర్చకులు నిర్వహించారు. తదనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలకు భక్తులను అనుమతించారు.
అంతర్వేదిలో నేడు
ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయస్వామి వాహనంపైన, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపైన గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. రాత్రి 1–56 గంటలకు రోహిణీ నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో స్వామివారి తిరు కల్యాణం కన్నుల పండువగా అర్చకులు, వేద పండితులు నిర్వహించనున్నారు.
స్వామి సన్నిధిలో ఏలూరు రేంజ్ ఐజీ
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలను ఐజీకి అందజేశారు. కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలను, ఉత్సవ ఏర్పాట్లను ఐజీ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీన్‌వీ ప్రసాద్‌తో ఆలయంలో సమీక్షించారు. కల్యాణం, రథోత్సవం, పౌర్ణమి స్నానాలకు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఐజీ, ఎస్పీ రాహుల్‌మీనా, డీఎస్పీ సుంకర మురళీమోహన్‌లతో చర్చించారు.


