దిక్కుతోచని దేశం
నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిపై పదనిసలు
రాజానగరం టీడీపీలో ఉనికిపాట్లు మొదలయ్యాయి. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కేవలం జనసేన నేతలకే ప్రాధాన్యం ఇస్తుండడం, టీడీపీ నేతలను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి ద్రాన్యం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గతంలో నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా పనిచేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. దానికి తోడు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఉండటంతో నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పు అనివార్యమైంది. పదవి ఎవరికి దక్కుతుందా అన్న సందిగ్ధం సర్వత్రా వ్యక్తమవుతోంది. వెంకటరమణ చౌదరి వర్గీయులకు ఇస్తారా..? పెందుర్తి వర్గీయులకు దక్కుతుందా..? అన్న చర్చ రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా నడుస్తోంది.
పెందుర్తి అన్నపూర్ణకు పగ్గాలు?
రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పగ్గాలు సీఎం పర్యటన వ్యవహారాల ఇన్‌చార్జి పెందుర్తి వెంకటేష్ సతీమణి పెందుర్తి అన్నపూర్ణకు దక్కే అవకాశం ఉందన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా వినిపిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనను పెందుర్తి వెంకటేష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తనకే దక్కుతుందన్న ధీమాలో పెందుర్తి ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ నుంచి సైతం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. పెందుర్తి వెంకటేష్ సైతం సీఎం చంద్రబాబు స్థాయిలో పదవికి కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ తండ్రితో పరిచయం ఉన్న నేతలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి తన తల్లికి దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వెంకటరమణ చౌదరి వర్గం సైతం తమ వర్గీయులకు ఇప్పించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
● క్యాడర్‌కు అందుబాటులో లేని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ‘బొడ్డు’
● క్రిస్మస్ నుంచీ ఎన్టీఆర్ వర్ధంతి వరకూ అడ్రస్ లేని వైనం
● ఎవరికి వారే కార్యక్రమాల నిర్వహణ
● రుడా చైర్మన్ అయినప్పటి నుంచీ
కార్యకర్తలకు మరీ దూరం
● పెందుర్తి వర్గీయులతో
పొడచూపిన వర్గ విభేదాలు
● వెంకటేష్ సతీమణి అన్నపూర్ణకు
నియోజకవర్గ పగ్గాలు వచ్చేలా యత్నాలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య రాజకీయ ముసలం పుట్టిందా? పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి మధ్య వర్గ విభేదాలు ఇప్పటికే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వెంకటరమణ చౌదరి వర్గంలోనే అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన వ్యవహార శైలే కారణంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ పదవి దక్కినప్పటి నుంచి నియోజకవర్గ కేడర్‌ను చౌదరి పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం వరించింది. దీంతో ఆయన సొంత అనుచర వర్గాన్ని పట్టించుకోలేనంతగా మరింత బిజీ అయిపోయారని చెప్తున్నారు. దీంతో తమ సమస్యలు, తమ పనులు ఎవరితో చెప్పి చక్కబెట్టుకోవాలో తెలియక నిట్టూరుస్తున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం టికెట్ జనసేన నేత బత్తుల బలరామకృష్ణకు కేటాయించారు. అప్పట్లో టీడీపీ నేతలు, బొడ్డు వర్గీయులు బత్తుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బత్తుల వద్దకు వెళ్లాలన్న మీమాంస ఆ క్యాడర్‌లో నెలకొంది. చేసేది లేక, తమ పనులు, తమను నమ్ముకుని వచ్చే ప్రజల అవసరాలు తీర్చుకునేందుకు బత్తుల వద్దకే వెళ్తున్నట్లు సమాచారం. అదే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యాక్టివ్‌గా ఉంటే సమస్యలు అక్కడికే వెళ్లి చెప్పుకొనే వాళ్లమన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
క్రిస్మస్ నుంచి ఎన్టీఆర్ వర్ధంతి వరకూ..
పండగ, నూతన సంవత్సర వేడుకలు.. వర్ధంతి ఇలా.. ఏ కార్యక్రమమైనా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కలిసి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వెంకటరమణ చౌదరికి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టారు. కీలక పదవి ఇచ్చినా.. కేడర్‌కు మాత్రం అందుబాటులో ఉండడం లేదనే పేరు తెచ్చుకున్నారు. క్రైస్తవులకు అత్యంత ప్రధానమైన క్రిస్మస్ పండగకు సైతం స్థానికంగా, జిల్లా కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన వర్గీయులు, అభిమానులు అయోమయానికి గురయ్యారు. నూతన సంవత్సర వేడుకలు సైతం నియోజకవర్గ ఇన్‌చార్జి లేకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. చివరికి సంక్రాంతి సంబరాలకు సైతం స్థానికంగా లేకపోవడంతో కేడర్ ఎవరికివారే అన్న రీతిలో పండగలు చేసుకున్నారు. అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను సైతం నిర్వహించే నాథుడే కరువయ్యాడు. జిల్లా అధ్యక్షుడు లేకపోవడంతో టీడీపీ నేతలకు ఎవరికి వారు ఎన్టీఆర్ ఫొటోలకు దండలు వేసి మమ అనిపించేశారు. రాజానగరం నియోజకవర్గ కార్యాలయం కార్యకర్తలు లేక వెలవెలబోయింది. అదే జిల్లా అధ్యక్షుడు ఉంటే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేవారమన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తమ వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లడంతో కేడర్‌కు అందుబాటులోని లేరన్న సమాధానం ఆయన వర్గీయుల నుంచి వస్తోంది.
పీఏ పెత్తనంపై క్యాడర్ గుర్రు
ఆయన సంగతి అటుంచితే.. ఆయన పీఏ పెత్తనం బాగా పెరిగిపోయిందని, భరించలేని స్థాయిలో ఉందని, కార్యకర్తలను చులకనగా చేసి మాట్లాడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం శ్రమించిన తమపై పీఏ పెత్తనం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం.
దిక్కుతోచని దేశం
దిక్కుతోచని దేశం
దిక్కుతోచని దేశం


