సంక్రాంతి కిక్కు..! | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతి కిక్కు..!

Jan 18 2026 7:17 AM | Updated on Jan 18 2026 7:17 AM

సంక్ర

సంక్రాంతి కిక్కు..!

సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతి కిక్కెక్కింది. పండగ మూడు రోజులూ మద్యం ఏరులైపారింది. కూటమి నేతృత్వంలోని మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూర్చేందుకు అనధికారిక అనుమతులు ఇచ్చేశారు. ఇదే అదనుగా భావించిన కూటమి సిండికేట్‌ ఎక్కడబడితే అక్కడ అమ్మకాలు సాగించడంతో మందుబాబులు ఫుల్‌ కొట్టి తూలారు. కోడిపందేల బరుల వద్ద ఏకంగా బార్లను తలపించేలా ఏర్పాట్లు చేసి మరీ తాగించేశారు. అక్కడే కూర్చొని తాగేందుకు సౌకర్యాలు కల్పించడం.. స్నాక్స్‌, కూల్‌డ్రింక్స్‌, వాటర్‌ బాటిళ్లు అందుబాటులో ఉంచడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఐఎంఎల్‌ డిపోల లెక్కల ప్రకారం రెండు రోజుల పాటు జరిగిన విక్రయాల్లో రూ.16.92 కోట్ల మద్యం, బీర్లు మద్యం షాపులకు సరఫరా చేశారు. మూడు రోజుల పాటు జరిగిన విక్రయాల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా మందు తాగేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.

మద్యం పరవళ్లు

మద్యం వ్యాపారులకు సంక్రాంతి ఫుల్‌ కిక్‌ ఇచ్చింది. మూడు రోజుల పాటు కనకవర్షం కురిపించింది. మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. వారం క్రితమే ప్రభుత్వం బాటిల్‌పై రూ.10 పెంచింది. దీంతో ముందు జాగ్రత్తగా మద్యం షాపుల యజమానులు ముందుగానే స్టాక్‌ తెచ్చి పెట్టుకున్నారు. మూడు రోజుల పాటు యథేచ్ఛగా విక్రయాలు సాగించారు. మద్యం షాపుల వద్ద సందడి నెలకొంది. పర్మిట్‌ రూమ్‌లకు సైతం అనుమతులు ఉండటంతో అక్కడే తాగి తూలే పరిస్థితి తలెత్తింది. దీనికితోడు కోడిపందెం బరుల వద్ద అనధికారిక విక్రయాలు జోరందుకున్నాయి. రాత్రింబవళ్లు విక్రయాలు సాగించారు. బార్లను తలపించేలా ఏర్పాట్లు చేయడం, మందు తాగడానికి అవసరమైన అన్ని వసతులు, తినుబండారాలు అందుబాటులో ఉంచడంతో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా తెగ తాగేశారు.

జిల్లాలో ఇలా..

రాజమహేంద్రవరం రూరల్‌ ఐఎంఎల్‌ డిపో పరిధిలో తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్‌, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాల పరిధిలోని 134 మద్యం షాపులు, 27 బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు మద్యం, బీర్లు సరఫరా చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13, 14వ తేదీల్లో మద్యం వ్యాపారులు ఐఎంఎల్‌ డిపో నుంచి రూ.10.63 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసి.. ప్రజలకు విక్రయించారు. 13వ తేదీ 3,280 లిక్కర్‌ కేసులు, 6,271 బీర్ల విక్రయాలు జరిగాయి. వీటి విలువ రూ.3.68 కోట్లు. 14వ తేదీన 7,031 లిక్కర్‌ కేసులు, బీర్లు 9,493 విక్రయాలు జరిగాయి. అత్యధికంగా ఒక్క రోజులోనే రూ.6.95 కోట్ల మద్యం తాగేశారు.

● చాగల్లు ఐఎంఎల్‌ డిపో పరిధిలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు జిల్లాలోని 126 మద్యం షాపులు, 10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13, 14వ తేదీల్లో రూ.6.29 కోట్ల సరుకు ఐఎంఎల్‌ డిపోల నుంచి మద్యం వ్యాపారులు కొనుగోలు చేసి విక్రయించారు. ఈ నెల 13వ తేదీన 2,532 లిక్కర్‌ కేసులు, 3,291 బీర్లు విక్రయాలు జరగ్గా... రూ.2,61,47,953 వ్యాపారం జరిగింది. 14వ తేదీన 3,471 లిక్కర్‌ కేసులు, 4,880 బీర్ల విక్రయాలు జరిగాయి. వాటి విలువ రూ.3,68,34,225 ఉంది.

కూటమి సిండికేట్‌కు లబ్ధి చేకూర్చేలా..

చంద్రబాబు ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా మందుబాబులపై తన ప్రతాపం చూపింది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతి సీసాకు రూ.10 మందుబాబుల నుంచి అదనంగా వసూలు చేసింది. కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10ల ధర పెంపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.99 (180 ఎంఎల్‌) ధర ఉన్న ఇండియన్‌ మేడ్‌ ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌, ఆర్‌టీడీలను ఈ పెంపు నుంచి మినహాయించినట్లు ఎకై ్సజ్‌ శాఖ పేర్కొంది. బార్లపై విధిస్తున్న అదనపు ఏఆర్‌ఈటీను తొలగించేందుకు అంగీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీని వెనుక కూటమి నేతృత్వంలోని మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం ఉద్దేశంగా పెట్టుకుంది.

అడ్డూ అదుపులేని విక్రయాలు

మద్యం వ్యాపారులకు లబ్ధి చేర్చడంలో భాగంగా అడ్డూఅదుపు లేకుండా విక్రయాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కోడిపందేల బరుల వద్ద యథేచ్ఛగా విక్రయిస్తున్నా అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. సంక్రాంతి పేరిట భారీగా విక్రయాలు జరిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల అండదండలతో అడ్డగోలు వ్యవహారం నడిచింది.

బెల్టుషాపుల్లో మరింత బాదుడు

సంక్రాంతి పండగ నేపథ్యంలో మద్యం షాపుల్లో ధ రలు పెరగడంతో అందుకు అనుగుణంగా నడుస్తు న్న బెల్టు షాపుల్లో సైతం మందుబాబులకు మరింత బాదుడు తప్పలేదు. ప్రతి మద్యం షాపునకు కనీసం 10 నుంచి 20 బెల్టు షాపులు వెలిశాయి. గతంలోనే ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేశారు. ప్రస్తుతం సీసాపై రూ.10 పెరగడంతో మళ్లీ ధర పెంచేశారు. సంక్రాంతి పండగ మూడు రోజులూ తమకు ఇష్టమొచ్చిన ధరకు అమ్మారు. బాటిల్‌పై ఏకంగా రూ.50 నుంచి రూ.60 అదనంగా వసూలు చేసిన సందర్భాలు లేకపోలేదు. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు నడిచింది. ఇది తెలిసినా ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.

పండగ వేళ భారీగా మద్యం విక్రయాలు

కోడిపందేల బరుల వద్ద బార్లను

తలపించేలా అమ్మకాలు

మూడు రోజుల్లో రూ.20 కోట్లకు పైగా విక్రయం

తాగి తూలిన మందుబాబులు

నిషేధించడంలో విఫలమైన

అధికార యంత్రాంగం

బాటిల్‌పై రూ.10 పెంపుతో

సిండికేట్‌కు రూ.కోట్లలో లాభం

సంక్రాంతి కిక్కు..!1
1/1

సంక్రాంతి కిక్కు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement