చంద్రబాబు ప్రభుత్వ దారుణహత్య
● దళిత యువకుడి హత్యపై
వైఎస్సార్ సీపీ ఆగ్రహం
● రాజమహేంద్రవరంలో
పార్టీ శ్రేణుల ఆగ్రహ జ్వాల
● వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు
సాలి వేణు ఆధ్వర్యంలో ధర్నా
● నిరసన చేపట్టిన
వైఎస్సార్ సీపీ నాయకులు
రాజమహేంద్రవరం సిటీ: దళిత యువకుడు మందా సాల్మన్‌ను చంద్రబాబు ప్రభుత్వం పాశవికంగా హత్య చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ఎస్సీ సెల్ జోన్ –2 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు ఆధ్వర్యంలో ఽనిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వినతిపత్రం అందించే కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత యువకుడు మందా సాల్మన్‌ను చంద్రబాబు ప్రభుత్వం పాశశ వికంగా హత్య చేసిందని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ కరవైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ హత్య అత్యంత దారుణమని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. బాధితుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సామాన్యులకు రక్షణ కరవు :
మాజీ ఎంపీ భరత్‌రామ్
మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ కరవైందన్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం.. దారుణ, మారణకాండ జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సాల్మన్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ఇసుక, భూ మాఫియా, హత్యలు, మానభంగాలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాలు పెచ్చుమీరి పోయాయని, ప్రజల మాన,ప్రాణాలకు భద్రత లేదని వాపోతున్నారని, ఇది వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఇది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ హత్య :
జెడ్పీ చైర్మన్ విప్పర్తి
జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ను దారుణంగా హత్య చేయడం ఈ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సాల్మన్‌పై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన అతను ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడని, ఇది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ హత్యేనన్నారు. గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రోద్బలంతో ఈ హత్య జరిగిందని ధ్వజమెత్తారు. దాచేపల్లి సీఐ గాయపడిన సాల్మన్ పైనే కేసు నమోదు చేయడం.. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా వ్యవరిస్తున్నారనడానికి నిదర్శనం అన్నారు. 19 నెలలుగా పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీకి చెందిన సుమారు 300 కుటుంబాలు గ్రామంలో ఉండకుండా బయట ఊళ్లలో నివసిస్తున్నారన్నారు. సాల్మన్ భార్య అనారోగ్యం పాలవడంతో ఆమెను చూడటానికి వచ్చిన మంద సాల్మన్‌పై విచక్షణ రహితంగా టీడీపీ గుండాలు దాడి చేయడంతో హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించి ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి :
మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా క్షీణించాయో ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చునన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయి సాల్మన్ హత్యకు ప్రత్యేక కారణమయ్యారన్నారు. చివరికి అతను మరణించిన తర్వాత కూడా అంత్యక్రియలకు వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల, దాచేపల్లి గ్రామాల్లో గత 19 నెలల్లో ఏడుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అమానుషంగా చంపేశారని ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మిమ్ములను ప్రజలు ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూల్యం చెల్లించక తప్పదు : హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ షర్మిలారెడ్డి
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ దళితులను హత్యలు చేస్తూ వెళితే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు మరోపక్క నచ్చని వారిపై అక్రమ కేసులు, అరెస్టులు, రిమాండ్లు, రోడ్లపై నడిపించడాలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, నక్కా నగేష్, స్టేట్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు మార్తి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాఢ సత్య ప్రియ, జిల్లా ఉపాధ్యక్షుడు దాసి వెంకట్రావు, మామిడిపల్లి సుధీర్, ఏపీఐడీసీ స్టేట్ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరగాటి దుర్గారావు, తగరం సోము, కస్సే రాజేష్, రేగుళ్ల నాని, గారా చంటిబాబు, చీకురుమిల్లి చిన్నా, మోర్తా పావనమూర్తి, కాకులపాటి శ్రీను పాల్గొన్నారు.


