నేడు పీజీఆర్‌ఎస్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని ఇన్‌చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్‌తో పాటు కలెక్టరేట్‌లోని ప్రత్యేక హాల్‌లో రెవెన్యూ అధికారుల సమక్షంలో రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులు సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అదే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలలో నమోదైన తప్పులను సరిదిద్దేందుకు కలెక్టరేట్‌లో మండలాల వారీగా ఆయా రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రత్యేక పరిశీలన చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవునికి ఆలయ ప్రాకారంలో ఆదివారం రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రథంపై వేంచేయించి, అర్చకులు దేవులపల్లి వరప్రసాద్ తదితరులు పూజలు చేశారు. అనంతరం, ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాల (ముత్తంగిసేవ) అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
లోవ దేవస్థానంలో భక్తుల రద్దీ
తుని రూరల్: లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలో 12 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఖరీఫ్ పనులు పూర్తి కావడం, సంక్రాంతి పర్వదినాలు ముగియడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చారన్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,34,535, పూజా టికెట్లకు రూ.2,25,100, తలనీలాలకు రూ.6,400, వాహన పూజలకు రూ.7,840, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.62,020, విరాళాలు రూ.23,774 కలిపి మొత్తం రూ.4,59,669 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
నేడు పీజీఆర్‌ఎస్
నేడు పీజీఆర్‌ఎస్


