భారత సారం శాంత్యనుశాసన పర్వాలు
సామవేదం షణ్ముఖశర్మ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మహాభారత సారమంతా శాంతి, అనుశాసన పర్వాలని, అంతే కాక వేద ధర్మాలను వేద వ్యాసుడు ఈ పర్వాలలో చెప్పారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆదివారం హిందూ సమాజంలో ఆయన ఈ పర్వాలలోని అనేక ధర్మాలను వివరించారు. కృష్ణానుగ్రహంతో భీష్ముడు ధర్మరాజాదులకు అనేక ధర్మాలు చెబుతూ, ఈ ధర్మాలు తాను చెబుతున్నవి కావని, ఎవరు ఎవరితో చెప్పారో ప్రామాణికంగా వివరించాడని అన్నారు. ముక్తి కావాలనుకునేవాడు క్షణకాలం వ్యర్థం చేసుకోరాదని, మనలోనే అమృతం, మృత్యువు రెండూ ఉన్నాయని సత్యమే అమృతం, మోహమే మృత్యువని ఆయన వివరించారు. దుఃఖానికి మూలం అధర్మం, సుఖానికి మూలం ధర్మం, ముక్తి సుఖదుఃఖాలకు అతీతమని, పాపం క్షయమైతే కాని, చిత్తశుద్ధి ఏర్పడదని, అందుకనే పూజాదులలో ‘మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా’ అని సంకల్పం చేయాలని సామవేదం వివరించారు. శాంత్యనుశాసన పర్వాల్లో ఆచారకాండను వ్యాసమహర్షి చెప్పారని, ఉభయ సంధ్యల్లో నిదురించరాదని, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలని, స్నానం చేయడంమంటే ఒంటిమీద నీళ్లు పోసుకోవడం కాదని ఆయన వివరించారు. సీ్త్రకి మాత్రమే పాతివ్రత్య ధర్మం కాదని, పురుషునికి గృహస్థాశ్రమ ధర్మం కూడా అవసరమని సామవేదం తెలిపారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా ధర్మాలను ఆచరించాలని ఆయన తెలిపారు. సీ్త్రకి సనాతన ధర్మం ఇచ్చిన ప్రాధాన్యం ప్రపంచంలో ఏ దేశమూ ఇవ్వలేదని అన్నారు. మనోవాక్కాయ కర్మల ద్వారా ఇతరుల పట్ల ద్రోహచింతన లేకపోవడమే శీలం, శీలం లేనివాడి సమస్త సంపదలూ నశించిపోతాయని భీష్ముడు చెప్పాడు. వైష్ణవం, శైవం, శాక్తేయం గాణాపత్యం ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నా, అన్నీ వేదాన్నే ప్రామాణ్యంగా పేర్కొన్నాయని సామవేదం అన్నారు.


