క్రూర బరిహాసం
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతి పండగ సంప్రదాయ బద్ధంగా నిర్వహించాలని, కోడిపందేలు, జూద క్రీడలకు దూరంగా ఉండాలని పోలీసులు, న్యాయస్థానాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయినా పందెంరాయుళ్లు హెచ్చరికలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. కూటమి ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో తమను అడ్డుకునేవారెవరు..? అంటూ పందెం రాయుళ్లు బరి తెగిస్తున్నారు. సంక్రాంతి ముసుగులో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పచ్చనేతలు సిద్ధం చేస్తున్నారు.
వీరికి పచ్చనేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో భారీ స్థాయిలో బరులు సిద్ధం చేస్తున్నారు. వాటికి హైటెక్ హంగులు అద్దుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు బరి స్థాయిని బట్టి ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరు ఎక్కడ పందేలు నిర్వహించుకోవాలన్న విషయమై ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసి నిర్ధారణకు వచ్చారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బరికి రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి.
హైటెక్ హంగులు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కోడిపందేలు, జూద క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బరులకు హైటెక్ హంగులు దిద్దుతున్నారు. కోరుకొండ, సీతానగరం, చినకొండేపూడి, సింగవరం తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో బరులు సిద్ధం చేస్తున్నారు. క్రికెట్ స్టేడియంను తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఏకథాటిగా పందేలు, జూద క్రీడలు నిర్వహించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. పందెం రాయుళ్లు, తిలకించేందుకు వచ్చే వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లు, సోఫాలు, కుర్చీలు సిద్ధం చేశారు. రాత్రిళ్లు పందేలు, జూద క్రీడలకు ఇబ్బంది లేకుండా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ కోత సమయంలో అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున జనరేటర్లు ముందస్తుగా అందుబాటులో పెడుతున్నారు. బరుల వారీగా మద్యం అమ్మకాలకు వేలం పాటలు నిర్వహించారు. వేలం దక్కించుకున్న వారే మద్యం విక్రయించేలా చూస్తున్నారు. నెంబర్లాట, గుండాట, పేకాట నిర్వాహకులకు సైతం వేలం నిర్వహించి స్థానాలు పదిలం చేశారు. జూద క్రీడలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, పలు ప్రాంతాల నుంచి జూదరులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు తలమునకలవుతున్నారు.
రాజానగరం
రాజానగరం నియోజకవర్గం చినకొండేపూడిలో పేకాట, కోడిపందేలు, గుండాట ఇతర జూద క్రీడలు భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యాసినో పెద్ద ఎత్తున పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం గోవా, నేపాల్ నుంచి కేసినో డీలర్లను రప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్రీకాట్స్, ప్లాన్, ఫుల్‌గేమ్, లోన బయట, గుండాట, పోకల్, కోతముక్క వంటి జూద క్రీడలు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాజవరం, రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, గోకవరం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో భారీ స్థాయిలో కోడి పందేల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. మధురపూడి ఆంజనేయస్వామి గుడి వెనుక పెద్ద బరి ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారి, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద జూద క్రీడలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది పుంజుల్ని పందెంలో పెడతారు. వాటిలో చివరి వరకు మిగిలిన పుంజుకు కారు బహుమతిగా ఇస్తారు. ఒక పుంజు వరుసగా పందేలు కొడితే బుల్లెట్ బైక్ ఇచ్చేలా ఆఫర్లు పెట్టి మరీ పందెం రాయుళ్లను నిర్వాహకులు ఆకర్షిస్తున్నారు.
నిడదవోలు
నిడదవోలు నియోజకవర్గం సింగవరంలో భారీ బరికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి సినీ ప్రముఖులు వస్తుంటారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో బరి సిద్ధం చేస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పేకాట, కోడిపందేలు, గుండాట ఇతర జూద క్రీడలు ఆడించేందుకు సర్వం సిద్ధమైంది. ఒక్కో పందెం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పలకనుంది. డి.ముప్పవరంలో సైతం మూడు బరులు ఏర్పాటవుతున్నాయి.
కొవ్వూరు నియోజకవర్గంలో 12 బరులు ఏర్పాటవుతున్నాయి. కొవ్వూరు మండలం ధర్మవరం వద్ద భారీ బరి వెలుస్తోంది. మొదటి రెండు రోజులు బుల్లెట్, మూడో రోజు కారు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తద్వారా సంక్రాంతి మూడు రోజులు భారీగా జూద క్రీడలను ప్రోత్సహించాలన్నది ఉద్దేశంగా పెట్టుకున్నారు.
రాజమహేంద్రవరం రూరల్ u
మండలానికి ఒకటి చొప్పున అధికారికంగా.. అనధికారికంగా పదుల సంఖ్యలో బరులు సిద్ధమవుతున్నాయి. 100 ఫీట్ రోడ్డు వద్ద టీడీపీ నేత కుమారుడి ఆధ్వర్యంలో బరులు సిద్ధం చేస్తున్నారు.
కాలుదువ్వుతున్న పందెం కోళ్లు
కోర్టు ఆదేశాలు, పోలీసు హెచ్చరికలు బేఖాతరు
భారీ స్థాయిలో నిర్వహణకు ఏర్పాట్లు
నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల
నేతృత్వం
రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం
డే అండ్ నైట్ జూదాలు నడిచేలా సౌకర్యాలు
కూటమి నేతల నేతృత్వం?
కోడిపందేల బరులు సింహభాగం ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలతో టీడీపీ, జనసేన నేతల కనుసన్నల్లో ఏర్పాటవుతున్నాయి. ఏ గ్రామంలో ఎవరు బరి నిర్వహించాలి? పేకాట, గుండాట ఎవరు పెట్టుకోవాలి? అన్నది నిర్ణయించడానికి వేలం పాట నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కువకు పాడితే వారికి ఆయా బరుల్లో స్థానం కల్పిస్తారు. వేలం పాటల్లో ఒక్కో బరి రూ.లక్షల్లో పలుకుతోంది. వేలంలో వచ్చే సొమ్మును ఎవరు ఎంత పంచుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు. రూ.20 లక్షల బరిలో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీసులకు రూ.3 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. బరి స్థాయిని బట్టి మొత్తం మరింతగా పెరగనుంది.
హెచ్చరికలు తూచ్!
న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడిపందేల నిర్వహణకు అనుమతులు ఇచ్చేది లేదంటూ పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన బరులను కొన్నిచోట్ల తొలగించారు. ఇదిలా ఉంటే.. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు ఇలాంటి ఆదేశాలు రావడం సాధారణమని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. పోలీసుల ఎదుటే బరులు సిద్ధం చేస్తున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నామ్‌కే వాస్తే అన్న చందంగా రెండు బరులు తొలగించి ఫొటోలకు పొజులు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఎవరి వాటాలు వారికి..!
బరులు, జూదక్రీడల నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, పోలీసులు, పచ్చనేతలు, కూటమి నేతలు ఇలా.. ఎవరి వాటాలు వారికి చేరుతున్నట్లు తెలిసింది. బరి స్థాయిని బట్టి రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్టు సమాచారం. మొదట్లో పోలీసులు బరుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. బేరం కుదిరిన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్లు తెలిసింది.


