‘ఈ యుద్ధం నీ చావు కోసమే వచ్చింది’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): నీవు రణభూమి నుంచి పారిపోకుంటే అదే చాలు, ఈ యుద్ధం నీ చావు కోసమే వచ్చిందని సారథ్యం చేస్తున్న శల్యుడు కర్ణుని ఎత్తి పొడిచాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందు సమాజంలో సోమవారం ఆయన కర్ణ పర్వంలోని ప్రధాన సన్నివేశాలను వివరించారు. ‘మానవ శ్రేష్ఠుడుయిన అర్జునుడు ఎక్కడ? మానవాధముడవయిన నీవు ఎక్కడ? నక్క యుద్ధంలో రెండు సింహాలను చంపడం ఎటువంటిదో, నీవు కృష్ణార్జునులను ఎదుర్కోవడం అటువంటిదే’నని శల్యుడు కర్ణుని నిందిస్తాడు. దుర్యోధనుడు శల్యునితో కర్ణునికి సారధి కమ్మంటే, శల్యుడు ముందు అంగీకరించలేదు. నీవు కృష్ణుని కంటె అధికుడవు, త్రిపురా సంహారంలో బ్రహ్మదేవుడు శివునికి సారథ్యం వహించాడని దుర్యోధనుడు శల్యునికి నచ్చచెబుతాడు. తాను అప్రియమైన మాటలను మాట్లాడినా, కర్ణుడు అంగీకరించాలని శల్యుడు చెబుతాడు. కర్ణుని శరాఘాతానికి అలసిన ధర్మరాజు శిబిరానికి తిరిగి వస్తాడు. అన్నగారికి ఏమయిందోనన్న ఆందోళనతో అర్జునుడు శిబిరానికి వస్తాడు. అర్జునుని చూసి, కర్ణుడు మరణించాడని భావించిన ధర్మరాజు అర్జునుని అభినందిస్తాడు. కర్ణుడు ఇంకా మరణించలేదని అర్జునుడు చెప్పగానే ధర్మరాజు మండిపడతాడు– ఆ గాండీవాన్ని కృష్ణునికి ఇచ్చివేసి, నీవు సారథిగా మారిపో, ఎందుకీ గాండీవమని ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. గాండీవాన్ని నిందించిన వానిని తాను సంహరిస్తానని ప్రతిన చేశానని అర్జునుడు తన ఒర లోని ఖడ్గాన్ని తీస్తాడు. కృష్ణుడు వారిస్తాడు. తాను ప్రతిన నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలో చెప్పమని అర్జునుడు కృష్ణుని వేడుకుంటాడు. గురువు వంటి అన్నను నీవు, నీవు అని మర్యాద లేకుండా మాట్లాడమని, అది అన్నను చంపడంతో సమానమని కృష్ణుడు అంటాడు. తరువాత, అన్నగారి మీద కత్తి దూసినందుకు అర్జునుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. కృష్ణుడు వారించి, నిన్ను నీవు పొగుడుకో, ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని సలహా ఇస్తాడు. కృష్ణుడు లేకపోతే, పాండవులు ఏమయిపోయేవారోనని సామవేదం అన్నారు. ఇక అర్జునుడు ధర్మరాజు పాదాలను స్పృశించి వలవలా ఏడుస్తాడు, మానవ సహజమైన ఉద్రేకాలకు మనం లోబడినప్పుడు, కృష్ణుని కృప మనలను కాపాడిందని ధర్మరాజు అంటాడు. కృష్ణ కారుణ్యమే భారత సారాంశమని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కర్ణుని వధ కోసం కృష్ణార్జునులు ముందుకు సాగారని ఆయన అన్నారు.


