హైడ్రో డాటిక్ ప్రెషర్ తగ్గడం వల్లే బ్లో అవుట్ అదుపు
● ఓఎన్‌జీసీ అధికారుల గొప్పతనం లేదు
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఽ
అమలాపురం రూరల్: మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ఓఎన్‌జీసీ అధికారుల గొప్పతనం వల్ల ఆరలేదని, బావిలో హైడ్రో డాటిక్ ప్రెషర్ తగ్గడం వల్లే ఆగిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో చమురు సంస్థల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చమురు సంస్థల వల్ల కోనసీమ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోరారు. కోనసీమలో తరచు బ్లో అవుట్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్లో అవుట్ల వల్ల భూమి కుంగిపోయి సముద్రం వెనకకు వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమలో వేలాది ఎకరాలు భూములు ఉప్పుగా మారుతున్నాయని అన్నారు. కోనసీమలో 1993లో కొమరాడ, 1995లో పాసర్లపూడి, 1997 దేవరలంక, 2024లో ఉప్పుడిలో చమురు సంస్థల నిక్షేపాలు వెలికి తీసే సమయంలో రిగ్గుల వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. 2014లో నగరం వద్ద గెయిల్ పైపులైన్ పేలిన ఘటనలో 22 మంది మృతి చెందారన్నారు. కేజీ బేసిన్ పరిధిలో వేలాది కోట్ల రూపాయల సరకును చమురు సంస్థలు తరలించుకుపోతున్నప్పటికీ, స్థాని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని అన్నారు. కోనసీమ వాసులకు ఉచిత వంట గ్యాస్ పథకాన్ని సైతం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ ధ్వజమెత్తారు.


