డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు పోరాటం
రైతుల అఖిలపక్ష సమావేశం తీర్మానం
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లాలో కాలువలు, డ్రైన్ల వ్యవస్థను ప్రభుత్వం ఆధునీకరించాలని, లేకుంటే రైతు సంఘాలతో పోరాటం చేస్తామని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన రైతుల అఖిల పక్ష సమావేశం హెచ్చరించింది. కోనసీమలో కాలవలు, డ్రైనేజీలు ఆక్రమణలతో మూసుకుపోవడంతో రైతులు ఖరీఫ్ సాగు మానేస్తున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. అమలాపురం మండలం సమనస గ్రామంలో మీ డెవలపర్స్ వినాయక లేఔట్స్‌లో సోమవారం రైతుల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉప్పులగుప్తం మండలం కూనవరం, అల్లవరం మండలం రామేశ్వరం సముద్ర మొగలు మూసుకుపోయి ముంపు సమస్య ఏర్పడి రైతులు నష్ట పోతున్నారని రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు( బాబి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ రైతు సంఘాలు ఒక వేదికపైకి వచ్చి సమస్యలను ప్రభుత్వం దుష్టికి తీసుకు వెళ్లాలన్నారు.
తెలుగు రైతు విభాగం నాయకులు యాళ్ల బ్రహ్మానందం, ఆకుల లక్ష్మణరావు మాట్లాడుతూ శంకరగుప్తం డ్రైయిన్ ఆధునీకరణ వల్ల రైతులకు ఉపయోగం ఉండదన్నారు. బీకేఎస్ ఆఖిల భారత కార్యవర్గ సభ్యులు జలగం కుమార్‌స్వామి మాట్లాడుతూ క్రాప్ హాలిడే ద్వారా కోనసీమ రైతుల ఉద్యమాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. వెబ్‌లాండ్ పోర్టల్‌లో లోపాలు, రెవెన్యూ తప్పిదాలు రైతుకు శాపాలుగా ఉన్నాయన్నారు. ఉత్పత్తి వ్యయంలో 70 శాతం మేర కూడా మద్దతు ధర రావడం లేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కీలక మార్పులు చేయాలని, థర్డ్ పార్టీ బీమా ద్వారా పొలాలలో జరిగే ప్రమాదాలకు రైతులకు రక్షణ కల్పించాలి సమావేశం తీర్మానం చేసింది. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందుకూరి సత్యనారాయణరాజు, సంయుక్త కార్యదర్శి గుబ్బల రమేష్, రైతు సంఘాల ప్రతినిధులు రంబాల బోసు, బొరుసు మురళి, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, యాళ్ల వెంకటనందం, బొక్కా ఆదినారాయణ, ముత్యాల జమీలు, మట్లా మహాలక్ష్మి ప్రభాకర్, అప్పారి వెంకటరమణ పాల్గొన్నారు.


