దారి చూపండి స్వామీ!
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసి రత్నగిరిపై ఆ స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదం స్వీకరించాలని అనుకుంటారు. కానీ, అన్నదాన భవనం ఎక్కడుందో తెలిపే బోర్డులు రత్నగిరిపై ఎక్కడా కానరావడం లేదు. అలాగే, సత్యదేవుని ప్రసాదాన్ని భక్తులు అమృతంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదం కొనుగోలు చేసి, స్వస్థలాలకు తీసుకుని వెళ్లి, బంధుమిత్రులకు అందిస్తారు. కానీ, ఆ ప్రసాదాలు ఎక్కడ విక్రయిస్తారో తెలిపే బోర్డులు సైతం దేవస్థానంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో, భక్తులు అవస్థలు పడుతున్నారు.
సంక్రాంతి సెలవుల సందర్భంగా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సోమవారం సత్యదేవుని దర్శించుకున్నారు. అనంతరం, పశ్చిమ రాజగోపురం వద్దకు వచ్చి చూస్తే స్వామివారి అన్నదాన భవనం ఎక్కడుందో తెలిపే బోర్డులు కనిపించలేదు. దాంతో అక్కడి వ్యాపారులను అడిగారు. వారు ఎదురుగా ఉన్న పసుపు రంగు భవనం చూపించారు. అయితే, దానిపై అన్నదాన భవనం అని కాకుండా, ‘రాజు వేగేశ్న ఫౌండేషన్ భవనం, యూనియన్ బ్యాంక్ ఏటీఎం’ అని మాత్రమే ఉండటంతో అనుమానం వచ్చి మరోసారి అడిగారు. చివరకు ఆ భవనంలోనే అన్నదానం నిర్వహిస్తున్నారని చెప్పడంతో ఆ భక్తులు అక్కడకు వెళ్లారు. ప్రసాదం కౌంటర్లకు వెళ్లేందుకు సైతం భక్తులు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ ఫార్మా నిర్మించిన విశ్రాంతి షెడ్డులో కూడా ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు. కానీ, దీనికి సంబంధించిన సమాచారం తెలిపే బోర్డులు ఎక్కడా లేవు. సత్యదేవుని ప్రసాదం విభాగాన్ని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తరచూ సందర్శించి, తయారీ విధానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రసాదం ఎలా ఉందని భక్తులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే, అన్నదాన పథకంలో భక్తులతో కలసి భోజనం చేసి, వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా, బోర్డులు లేకపోవడం భక్తులకు ఇబ్బందిగా మారింది. పశ్చిమ రాజగోపురం, ఆలయ ప్రాకారంతో పాటు రత్నగిరిపై వివిధ ప్రాంతాల్లో రాత్రి వేళ కూడా స్పష్టంగా కనిపించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఫ అన్నదాన భవనం ఎక్కడుందో
తెలియని దుస్థితి
ఫ ప్రసాదం విక్రయ కౌంటర్లదీ అదే పరిస్థితి
ఫ రత్నగిరిపై ఆ వివరాలు తెలిపే బోర్డులు లేక భక్తులకు అవస్థలు


