జిల్లాలో కోడిపందేల నిషేధం
ఎస్పీ నరసింహ కిశోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిషేధించినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. జూద క్రీడలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు. పండగ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందేల నిర్వహణకు ఏర్పాటు చేసిన బరులు ధ్వంసం చేశామన్నారు. కోడి పందేల బరులు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. బైండోవర్ కూడా చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.
227 అర్జీల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలను సంబంధిత అధికారులు శ్రద్ధతో స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కారం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 227 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌లో 129 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఆదేశాల మేరకు నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చారు.
పురుగు మందుల అవశేషాలు లేని పొగాకు పండించండి
టుబాకో బోర్డు అధికారిణి హేమస్మిత
దేవరపల్లి: పురుగు మందుల అవశేషాలు లేని పొగాకు పండించాలని టుబాకో బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారిణి పి.హేమస్మిత రైతులకు సూచించారు. దేవరపల్లి మండలం బందపురంలో సోమవారం పొగాకు రైతుల సమావేశం నిర్వహించారు. పొగాకు సాగులో సస్యరక్షణ, తల తుంచుట, పిలక నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. టుబాకో బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు రీజనల్ మేనేజరు జీఎల్‌కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న తెల్ల దోమ నుంచి వ్యాపించే వైరస్‌లకు, రసం పీల్చు పురుగుల నివారణకు 10 లీటర్ల నీటిలో 3 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌ను వాడి నివారించుకోవాలన్నారు. తలలు తుంచిన తర్వాత ఎటువంటి పురుగు, తెగుళ్లు మందులు వాడరాదని సూచించారు. ప్రపంచ దేశాల్లో పాగాకు ఉత్పత్తి పెరిగినందున పంట నియంత్రణ పాటించి నాణ్యమైన పంటను పండించాలని తెలిపారు. ఐటీసీ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, జీపీఐ ప్రతినిధి రవి, పీఎస్‌ఎస్ కంపెనీ ప్రతినిధి గౌతమ్, క్షేత్రస్థాయి అధికారి పి.వినోద్‌కుమార్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పొగాకు తోటలను పరిశీలించారు.
అంతర్వేది ఉత్సవాల
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
సఖినేటిపల్లి: అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న లక్ష్మీనరసింహాస్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల వాల్ పోస్టర్‌ను సోమవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవిష్కరించారు.
జిల్లాలో కోడిపందేల నిషేధం


