పండగంతా ట్రావెల్స్‌దే!
ప్రైవేటు బస్సుల వద్ద ప్రయాణికుల హడావుడి
● ప్రయాణికుల రద్దీని సొమ్ము
చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు
● చార్జీలు రెండింతల పెంపు
● గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
● నియంత్రించలేకపోతున్న అధికారులు
సాక్షి, రాజమహేంద్రవరం: పండగ ప్రయాణం హడలెత్తిస్తోంది. దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చేవారి జేబులకు భారీగా చిల్లు పెడుతోంది. ప్రైవేటు బస్సులు చార్జీల మోత మోగిస్తున్నాయి. పండగ రద్దీని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు దండిగా సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రతి పండగకూ ప్రైవేటు బస్సుల్లో సీటుపై 10 నుంచి 15 శాతం పెంచుకోవడం ఆనవాయితీ. పండగ దృష్ట్యా పెంపును ప్రయాణికులు సైతం అంగీకరిస్తారు. కానీ ఈ సారి 60 నుంచి 100 శాతం అడ్డగోలుగా దోచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సాధారణ ధరలే చూపిస్తున్నా.. బుక్ చేద్దామంటే ఖాళీలు కనిపించడం లేదు. ప్రైవేటు బస్సుల సెంటర్లను ఆశ్రయిస్తే.. భారీగా ధరలు చెప్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే సీట్లు ఖాళీ లేవంటున్నారు. ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లైతే సీట్లను డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. ధరల పెంపుపై ఎవరైనా ప్రశ్నిస్తే వాహనాల తనిఖీలు, ఇతర ఖర్చులు, డీజిల్ రేట్లు తడిసి మోపెడవుతున్నాయని, తాము ఏం చేయగలమని అంటున్నారు.
వేల మంది రాక
జిల్లాలో సంక్రాంతి పండగకు ప్రత్యేకత ఉంది. కోడి పందేలు, సంప్రదాయ పందేలు తిలకించేందుకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన స్థానికులు, వారి స్నేహితులు, బంధువులు ఇలా వేల సంఖ్యలో వస్తుంటారు. సుమారు 10 నుంచి 15 వేల మంది వరకు ప్రయాణాలు చేస్తుంటారని అంచనా. వీరిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారే. మిగిలిన వారు బెంగుళూరు, చైన్నె, నెల్లూరు, కృష్ణా, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. సంక్రాంతికి మూడు రోజుల ముందుగానే ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికులు రావడం ప్రారంభమవుతుంది. కనుమ, ముక్కనుమ తర్వాతి రోజు 17న తిరుగు ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి ముందు, తర్వాత రోజుల్లో బస్సులు, రైళ్లకు డిమాండ్ ఉంటుంది. ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్‌నే అధిక శాతం మంది ఆశ్రయిస్తుంటారు. ఇదే తడవుగా వారి జేబులను గుల్ల చేస్తున్నాయి ఆయా యాజమాన్యాలు. నలుగురు సభ్యులున్న కుటుంబం బస్సు ఎక్కాలంటే కేవలం చార్జీలకే రూ.15 వేలు పెట్టాల్సిన పరిస్థితి. తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్‌లు చేసేస్తున్నారు.
టెకీలే లక్ష్యం
జిల్లాకు చెందిన ఎందరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లో ఉన్నారు. సంక్రాంతి పండగకు వారు తమ స్వగ్రామాలకు రావాలని కోరుకుంటారు. అటువంటి వారే లక్ష్యంగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలు అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణాల విషయమై ఆఖరి నిమిషంలో తీసుకునే వారి నిర్ణయాల వల్ల ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు దొరకక తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయించి ఇలా అడ్డంగా డబ్బులు సమర్పించుకుంటున్నారు.
రైళ్లన్నీ కిటకిట
రాజమహేంద్రవరం కేంద్రంగా నిత్యం 110 రైళ్లు వివిధ ప్రాంతాలకు నడుస్తుంటాయి. వీటిలో 50 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ఒడిశా, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రైళ్లు నడుస్తుంటాయి. ప్రస్తుతం పండగ సీజన్ నేపథ్యంలో అన్ని రైళ్లలో బెర్త్‌లు ఫుల్ అయ్యాయి. రిజర్వేషన్‌లో చూద్దామంటే వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. దీంతో చేసేది లేక బస్సులే దిక్కవుతున్నాయి.
రవాణా శాఖ చర్యలు శూన్యం
పండగ రద్దీని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులపై రావాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వెబ్‌సైట్లలో అధిక రేట్లను పెట్టినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. మరికొంత మంది ఆన్‌లైన్‌లో సాధారణ ధర పెట్టి బుక్ చేసే సమయంలో మాత్రం పెంచేస్తూ మాయ చేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు నిత్యం అత్యధికంగా 35 బస్సుల వరకు వెళ్తుంటాయి. ఇక బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు ఓ మాదిరిగా ప్రయాణిస్తారు. సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్సు టిక్కెట్టు రూ.800 ఉండగా ప్రస్తుతం రూ.2500కు పైగా పెంచేశారు. స్లీపర్ కోచ్ సాధారణ రోజుల్లో రూ.1000 నుంచి రూ.1500 ఉండగా.. ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4,000పైనే వసూలు చేస్తున్నారు. అబీబస్, రెడ్‌బస్ వంటి వెబ్‌సైట్లలో డిస్కౌంట్లు ఉంటాయి. కానీ పండగ సీజన్‌లో మాత్రం ధరలు అధికంగా ఉంటున్నాయి. ఓ ట్రావెల్స్ సంస్థ అయితే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రూ.3,500 వసూలు చేయడం గమనార్హం. మరో సంస్థ రూ.4,500 చెప్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండు రోజుల్లో మరింత భారీగా పెంచే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం నుంచి చైన్నెకు సైతం రూ.4 వేలు చెప్తున్నారు.
పండగంతా ట్రావెల్స్‌దే!


