నీవు చూసినది శంకరుడినే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ద్రోణవధ అనంతరం అర్జునుని సంశయాన్ని తీరుస్తూ ‘నీవు చూసినది శంకరుడినే’నని శ్రీకృష్ణుడు వివరించాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆదివారం ఆయన ద్రోణపర్వాన్ని ముగించి, కర్ణపర్వాన్ని ప్రారంభించారు. సైంధవ వధ అనంతరం అర్జునుడు ‘‘మహా సంగ్రామంలో నేను శత్రువులను వధిస్తున్నానని అందరూ అంటున్నారు. కానీ, యుద్ధంలో నా ముందు జ్వలిస్తున్న శూలాన్ని ధరించి ఒక దివ్య పురుషుడు సంచరిస్తున్నాడు. ఆయన పాదాలు భూమిని తాకడం లేదు. ఆయన శూలం నుంచి వేలాది శూలాలు వచ్చి శత్రువులను నాశనం చేస్తున్నాయి. ఆయనెవరు?’ అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. ‘నీవు చూసింది శంకరుడి’నేనని కృష్ణుడు బదులిస్తాడు. అనంతరం, అర్జునుడి వద్దకు వ్యాసుడు వచ్చి, శతరుద్రీయ వ్యాఖ్యానాన్ని వివరిస్తా’’డని సామవేదం వివరించారు. భారతాన్ని మించిన వేద పురాణోపనిషత్తులు లేవని, స్వర నియమాలతో చదవాల్సిన రుద్రాన్ని వ్యాసుడు భారతం ద్వారా మనకు శ్లోక రూపంలో అందించాడని సామవేదం వివరించారు. వేదచోదిత కర్మలను ఏర్పరచిన వాడు, వేద ఫలప్రదాత ఈశ్వరుడేనని, నా నామాలన్నీ నీవే. నీ నామాలన్నీ నావేనని హరివంశంలో శంకరుడితో కృష్ణుడు అంటాడని ఆయన తెలిపారు. జ్ఞానం వలన మోక్షం కాదని, జ్ఞానమే మోక్షమనే విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయని తెలిపారు. భగవంతుడికి ఒకరిపై కాఠిన్యం, మరొకరిపై ప్రసన్నత ఉండవని, ధర్మాచరణ ఉన్నవారిని ఆయన రక్షిస్తాడని, ఉల్లంఘించిన వారిని శిక్షిస్తాడని అన్నారు. ద్రోణపర్వం విన్నా, చదివినా, ఘోర పాపాల నుంచి మానవులు విముక్తులవుతారని, వేదాధ్యయనం వలన కలిగే ఫలితం లభిస్తుందని వ్యాసుడు ఫలశృతి చెప్పాడని షణ్ముఖశర్మ తెలిపారు. శివకేశవుల అభేదాన్ని ద్రోణపర్వం వివరిస్తోందన్నారు. అనంతరం, కర్ణపర్వాన్ని ప్రారంభిస్తూ, కర్ణుడు సంగ్రామ బాధ్యత తీసుకోగానే కురువీరులందరూ ద్రోణవధ వలన కలిగిన వేదనను మరచిపోయారని, ఇది మానవ నైజమని చెప్పారు. అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు సాగించిన ఘోర యుద్ధాన్ని సామవేదం వివరించారు.


