విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
తొండంగి: విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన కొమ్మనాపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పెండ్యాల నాగేశ్వరరావు (24) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు.
కాడేడ్ల బండి నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం ఉదయం కొమ్మనాపల్లికి చెందిన ఓ రైతు పొలంలో పట్టె తోలేందుకు ఎద్దులను తీసుకు వెళ్లాడు. పట్టె తిరగేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్మోహన్‌రావు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


